
CM Revanth Reddy : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా రాష్ట్రస్థాయి రైతు భరోసా సభను నిర్వహించారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల ద్వారా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 30 నెలలుగా రైతు ఆత్మగౌరవంతో జీవించేలా వ్యవసాయాన్ని పండుగలా తీర్చిదిద్దేందుకు కట్టుబడి పనిచేస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
ఫస్ట్ తేదీనే ఉద్యోగులకు జీతాలు : గత ప్రభుత్వంపై కూడా సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర అప్పు రూ.69 వేల కోట్లు మాత్రమే ఉండగా, తమ (CM Revanth Reddy) ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రూ.8 లక్షల 11 వేల కోట్లకు చేరిందన్నారు. 60 ఏళ్లలో వచ్చిన అప్పుకన్నా కేవలం పదేళ్లలోనే కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని సీఎం రేవంత్ ఆరోపించారు.
ఉద్యోగుల జీతాలు, సర్పంచుల బకాయిలు, పాఠశాలల ఖర్చులు, స్వయం సహాయక మహిళల బిల్లులు, హాస్టళ్ల విద్యార్థుల చార్జీలు సైతం చెల్లించలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెల ఫస్ట్ తేదీనే ఉద్యోగులకు జీతాలు చెల్లించే విధానం అమలు చేస్తున్నామని చెప్పారు.
రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు 25.35 లక్షల మంది రైతులకు రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసా కింద ఇప్పటికే రూ.27 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. ఈ విడతతో కలిపి మొత్తం రూ.36 వేల కోట్లు చెల్లిస్తున్నామని వెల్లడించారు. వచ్చే 9 రోజుల్లోనే మరో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయన్నారు. అందుకు అవసరమైన నిధులు కూడా రెడీగా ఉన్నాయని సీఎం ప్రకటించారు.
ఫ్రీ కరెంట్ కోసం రూ. 30వేల కోట్లు : వ్యవసాయానికి కాంగ్రెస్ ప్రభుత్వ కట్టుబాటును కూడా వివరించారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పథకమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ కోసం నెలకు రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ.30 వేల కోట్లు వెచ్చించినట్టు తెలిపారు.
సన్న వడ్ల బోనస్ కోసం రూ.4 వేల కోట్లు, రైతు బీమా కోసం రూ.3,500 కోట్లు ఖర్చు చేశామన్నారు. మొత్తం రైతుల కోసం ఇప్పటివరకు రూ.1.75 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకు సగటున రూ.2 వేల కోట్లు మాత్రమే రైతులపై ఖర్చు చేసిందని, తమ ప్రభుత్వం నెలకు రూ.6 వేల కోట్లు వెచ్చిస్తోందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంపై చర్చకు సిద్ధమని ఈ సందర్భంగా సీఎం సవాల్ విసిరారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన పనులు, రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి చర్చిద్దామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు చేశారు. లక్షా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రాజెక్టు రెండేళ్లకే దెబ్బతిందని, అది కాళేశ్వరం కాక ‘కూలేశ్వరం’గా మారిందని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ తెలంగాణ రైతులు 3 ఏళ్లలో 2.80 కోట్ల టన్నుల ధాన్యం పండించారన్నారు.
కేసీఆర్‌పైనా ఘాటు వ్యాఖ్యలు : మాజీ సీఎం కేసీఆర్‌పై కూడా రేవంత్ రెడ్డి వ్యక్తిగత స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు ఆయన చెప్పిన కథలు విని చివరకు ఫామ్‌హౌస్‌కే పరిమితం చేశారన్నారు. రైతులకు ఇచ్చిన హామీల్లో రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి, కోటి ఎకరాలకు సాగునీరు వంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. రైతు బజార్ల స్థానంలో బెల్ట్ షాపుల సంస్కృతిని పెంచారని, సమాజాన్ని తాగుడు సంస్కృతి వైపు నడిపించారని సీఎం రేవంత్ ఆరోపించారు.
Read Also : Rythu Bharosa : రైతన్నలకు పండగే.. ‘రైతు భరోసా’ నిధులు విడుదల.. మీ ఖాతాలో పడ్డాయా? ఇలా చెక్ చేసుకోండి!
కేంద్ర ప్రభుత్వంపైనా సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆయా హామీలను కూడా ప్రధాని నరేంద్ర మోదీ నిలబెట్టుకోలేదన్నారు. తెలంగాణలో మాత్రం బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలపై ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఆర్టీసీ ఫ్రీ బస్సు ప్రయాణం కోసం ఇప్పటివరకు రూ.11 వేల కోట్లు వెచ్చించామని చెప్పారు. ఆర్టీసీని వెయ్యి కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. సింగరేణిని కూడా లాభాల బాట పట్టించామన్నారు. మహిళా సంఘాలతో వెయ్యి బస్సులు, వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. శిల్పారామంలో మహిళా సంఘాల స్టాల్స్ కోసం రూ.1000 కోట్ల విలువైన భూమిని కేటాయించినట్టు కూడా ఆయన వెల్లడించారు.
30 నెలల్లో 70వేల ప్రభుత్వ ఉద్యోగాలు : ఉద్యోగాల అంశంలోనూ తమ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. 30 నెలల్లో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్టు తెలిపారు. త్వరలో మరో 5 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని ప్రకటించారు. ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చామన్న ఆయన భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
రైతులకు సీఎం కీలక సూచనలు చేశారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని, వర్షాల పరిస్థితిని బట్టి పంటల సాగు చేయాలని సూచించారు. డిమాండ్ ఉన్న 7 రకాల సన్న వడ్ల విత్తనాలను రైతు వేదికల్లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. మార్కెట్లో మంచి ధర వచ్చే పంటలనే సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
ప్రసంగం చివర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు, రైతులు, మహిళలు, నిరుద్యోగులదేనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అభివృద్ధి పనులను అడ్డుకునే ప్రయత్నాలు జరిగినా తమ ప్రభుత్వం వెనక్కి తగ్గబోదన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత రైతులదన్నారు. ‘మేం కేసీఆర్‌లా తప్పు పనులు చేయం.. ఉన్నది ఉన్నట్లు చెబుతాం.. చేసినది చెబుతాం’ అని రేవంత్ స్పష్టం చేశారు.