
అమరావతి : ఏపీలో 2025 డీఎస్సీ ( DSC ) లో జరిగిన అక్రమాలపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ( Ys Jagan ) ముఖ్యమంత్రి చంద్రబాబు( Chandra Babu ) కు మరోసారి ట్విటర్ వేదిక ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు. డీఎస్సీ పరీక్షల విశ్వసనీయత కోల్పోతే యువత కలలకు రెక్కలు కత్తిరించినట్లేనని పేర్కొన్నారు. అభ్యర్థుల కష్టానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి జవాబుతారితనం ఉండాల్సిన అవసరం లేదా అంటూ నిలదీశారు. లక్షలాది మంది అభ్యర్థులు ఎన్నో సంవత్సరాలు కష్టపడుతూ తమ కుటుంబాలు కష్టపడి సంపాదించిన డబ్బుతో పరీక్షలకు హాజరవుతున్న సమయంలో వ్యవస్థ వారి ఆశలను నీరుగార్చవద్దని సూచించారు. న్యాయం అనేది ఒక ఐచ్ఛికం కాదు. అది ఒక బాధ్యతగా గుర్తించాలని కోరారు. డీఎస్సీలో జరుగుతున్న ప్రస్తుత కుంభకోణానికి చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు.




