
చిత్రంలో పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఉన్న టేకు నిల్వలు ప్రస్తుతం మాయం కొయ్యలగూడెం గ్రామీణ, పోలవరం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ హయాంలో నవరత్నాలు- పేదలకు ఇళ్లు కార్యక్రమం అమలు కోసం పోలవరంలో ప్రైవేటు వ్యక్తుల నుంచి 17.50 ఎకరాల భూములు కొనుగోలు చేసి రూ.కోట్లు చెల్లించారు. ఇదిగాక ఆ భూముల్లో గుర్తించిన 403 చెట్లకు అటవీశాఖ సర్వే నివేదిక మేరకు సుమారు రూ.31.50 లక్షలు విలువను నమోదు చేసి పరిహారం అందించారు. 2020 జులై తొలి వారంలో జరిగిన సంగతి. కొనుగోలు చేసిన భూముల్లో ఆర్‌ఎస్‌ నంబర్‌ 209, 209/4, 209/2లలో 46 టేకు, సర్వే నంబర్‌ 336లో 338 టేకు, 16 వేప, 3 చింత చెట్లు గుర్తించి అటవీశాఖ అధికారులు వాటి పరిమాణాన్ని 56.294 ఘనపుటడుగులుగా లెక్కించి విలువను సుమారు రూ.31.50 లక్షలుగా తేల్చారు. ఆ తర్వాత టేకు చెట్లను నరికించి కలపను పోలవరం తహసీల్దారు కార్యాలయ ప్రాంగణం, పోలీస్‌స్టేషన్‌ వెనుక భాగంలోని ఖాళీ స్థలంలోనూ ఉంచారు. అయితే తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఉన్న టేకు దుంగలు సుమారు ఆరేళ్లుగా ఎండకు ఎండి, వానకు తడుస్తూ ఆరు నెలల కిందటి వరకు అక్కడే ఉన్నాయి. అప్పట్లో పోలీస్‌స్టేషను వెనుక ఖాళీస్థలంలో ఉంచిన టేకు దుంగలు ఇప్పుడెక్కడా కనిపించడం లేదు. ఒకటీ రెండూ కాదు వందల్లో టేకు చెట్లు నరికి తెచ్చిన దుంగలను అప్పట్లో గుట్టలుగా పోశారు. వాటిలో వేప, చింత చెట్ల కలపను అప్పట్లోనే సిబ్బంది దారి మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత తహసీల్దార్లు మారడం, కలప సంగతి పట్టించుకోకపోవడం, పోలీస్‌స్టేషన్‌ నూతన భవన నిర్మాణం అదే ప్రాంగణంలో ప్రారంభించడం జరిగాయి. ఆ టేకు కలప భద్రపరిచిన దాఖలాలు కూడా లేవు. మొత్తంగా పరిశీలిస్తే.. చెట్లకు పరిహారం రూ.లక్షల్లో చెల్లించిన అధికారులు వాటి రక్షణను గాలికొదిలేశారు. ఉన్నతాధికారుల అనుమతితో ప్రస్తుత తహసీల్దారు తన కార్యాలయం వద్ద ఉన్న కలప వేలానికి ప్రకటన జారీ చేశారు. అక్కడ ఉన్న 82 టేకు దుంగల విలువను అటవీశాఖ అధికారులు రూ.1.95 లక్షలుగా నిర్ధారించారు. అయితే ఆశించిన మేర ధర రాకపోవడంతో వేలం రెండు పర్యాయాలు వాయిదా పడింది. మూడో పర్యాయంలో ఒకరు రూ.73,600లకు పాడగా చివరకు అధికారులు ఆ ధరనే ఖరారు చేశారు. ఆ మేరకు సొమ్మును చలానా రూపంలో చెల్లించడంతో కలప రవాణాకు అతడికి అనుమతి ఇచ్చారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





