
విమానాశ్రయం చుట్టూ పెరిగిన ఆక్రమణలు నక్కలపల్లి శివారులో ఆక్రమణకు గురైన విమానాశ్రయానికి వెళ్లే 80 అడుగుల రోడ్డు మామునూరు, న్యూస్‌టుడే: విమానం ఎగరక ముందే మామునూరు విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక విమానాశ్రయం అభివృద్ధి పనుల్లో కదలిక వచ్చింది. భూసేకరణ పూర్తి చేసి రైతులకు పరిహారం ఇవ్వడంతో వెంటనే కేంద్రం అనుమతులు ఇచ్చింది. త్వరలోనే పనులకు శంకుస్థాపన చేసేందుకు శ్రీకారం చుట్టనున్నారు. ఇదే అదనుగా రియల్టర్లు కొనుగోలుదారులను ముందుగానే విమానం ఎక్కించి జేబులు నింపుకొంటున్నారు. ‘చెట్టును చూపించి కాయలను అమ్మినట్లు’ రియల్టర్లు విమానాశ్రయం చుట్టూ 20 కిలో మీటర్ల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అనధికారిక, అక్రమ వెంచర్లు, వ్యవసాయ భూముల విక్రయాలకు తెరలేపారు. తమదైన శైలిలో ఇక్కడి భూములకు ధరలను పెంచేస్తున్నారు. వ్యవసాయదారుల నుంచి ఎకరాలు, గుంటల్లో తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి గజాల్లోకి మార్చి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. నక్కలపల్లి, గుంటూరుపల్లి, స్తంభంపల్లి, మామునూరు, తిమ్మాపురం, పున్నెలు, ఐనవోలు, బొల్లికుంట ప్రాంతాల్లో భూ దందా ఎక్కువగా జరుగుతోంది. విమానాశ్రయం అభివృద్ధి నేపథ్యంలో మామునూరు పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలు పెరిగిపోయాయి. తాజాగా నక్కలపల్లి గ్రామ శివారులో నుంచి విమానాశ్రయానికి వెళ్లేందుకు రెండో రహదారిగా నిజాం కాలంలో ఏర్పాటు చేసిన 80 అడుగుల రోడ్డు ఆక్రమణకు గురైంది. కొందరు ఏకంగా ప్రహరీ నిర్మించి దారిని కుదించారు. చాలాచోట్ల చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు అధికారుల అండతో కబ్జాకు గురయ్యాయి. ఇక్కడ భూములు కొనుగోలు చేసే వారంతా దూరప్రాంతాల నుంచే వస్తున్నట్లు ఓ రియల్టర్‌ తెలిపారు. భూములు కొనే ముందు అన్ని పత్రాలను సరిచూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్‌లైన్‌లో యజమాని పేరు, భూ వివరాలు తనిఖీ చేసుకోవాలి. ఇప్పుడు కొంటే కొద్దిరోజుల్లో ఎక్కువ ధర పలుకుతుందని ఆశజూపి విక్రయాలు చేస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకొని భూములు కొనుగోలు చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందిపడే ప్రమాదం ఉంటుంది. రియల్టర్లు తమ కమీషన్ల కోసం మోసపూరిత మాటలు చెప్పి క్రయవిక్రయాలకు పాల్పడుతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




