
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Vizag School Tragedy News: విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నగరంలోని వన్ టౌన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాలలో దారుణమైన ఘటన జరిగింది. టీచర్ దెబ్బలను తట్టుకోలేక ఆరేళ్ల బాలుడు మృతి చెందినట్లు సమాచారం. హోంవర్క్ చేయలేదనే కారణంతో ఉపాధ్యాయురాలు కొట్టడం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అసలు కారణం ఇదే? చిన్నారి ప్రణయ్ గుండెపోటుతో చనిపోయినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్ వర్సిటీకి చెందిన వైస్ ఛాన్స్లర్ చంద్రశేఖర్ మాట్లాడారు. తీవ్ర ఒత్తిడితో గుండె అకస్మాత్తుగా ఆగిపోతుందని..గతంలో ఎంసెట్ విద్యార్థులకు ఇలా జరిగిందని చెప్పారు. ప్రణయ్ తీవ్ర ఒత్తిడికి గురికావడం వల్ల గుండె ఎలక్ట్రికల్ షట్‌డౌన్ అయి చనిపోయి ఉండొచ్చని ఆయన వెల్లడించారు. టీచర్లు పిల్లలతో సున్నితంగా మాట్లాడాలని చంద్రశేఖర్ సూచించారు.
ఏం జరిగిందంటే..? విశాఖపట్నం వన్ టౌన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్ లో ప్రణయ్ తేజ అనే బాలుడు యూకేజీ చదువుతున్నాడు. అయితే క్లాస్ రూమ్ లో టీచర్ అందరి హోంవర్క్ ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రణయ్ తేజను హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు బెదిరించారు. దాంతో భయపడిపోయిన ప్రణయ్.. కొట్టొద్దు అంటూ విలపించాడు. అయినా ఆ ఉపాధ్యాయురాలు బాలుడి చెంపపై కొట్టింది. దాంతో బెదిరిపోయిన బాలుడు.. క్లాస్ రూమ్ లోనే స్పృహ కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. వెంటనే బాలుడ్ని కేజీహెచ్ కు తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రికి చేరుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. మరోవైపు బాలుడు ప్రణయ్ తేజ మృతిపై మంత్రి లోకేశ్ స్పందించారు. టీచర్ కొట్టడంతో చిన్నారి మరణించడం బాధాకరం అని అన్నారు. బాధ్యులు, సంబంధిత పాఠశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ప్రణయ్ తేజ తల్లిదండ్రులకు జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేనిదాని.. వారికి తన ప్రగాఢ సంతాపం తెలియజేయడంతో పాటు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ లో లోకేశ్ పోస్ట్ పెట్టారు.
ఇక ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి.. బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై ఏ విద్యార్థి కూడా ఇలాంటి విషాదానికి బలికాకుండా ప్రతి పాఠశాలలో పటిష్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని, ఉపాధ్యాయుల ప్రవర్తనపై కఠిన పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విద్యార్థులకు విద్యతో పాటు భద్రత కల్పించడం ప్రతి పాఠశాల యాజమాన్యం బాధ్యత అని.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకుని కఠిన నిర్ణయాలు అమలు చేయాలని తల్లిదండ్రులతో పాటు స్థానికులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





