
విశాఖ: మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ, తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడమే యువత భవిష్యత్తుకు నిజమైన రక్షణ అని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. విశాఖపట్నంలోని ప్రిజమ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ విద్యార్థులతో బుధవారం నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమగ్రంగా సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో సమాచారాన్ని పొందడం గతంలో కంటే ఎంతో సులభమైందని శ్రీభరత్ అన్నారు. విశాఖ పట్టణాన్ని ఐటీ, టెక్నాలజీ రంగాల్లో మరింత అభివృద్ధి చేయడానికి బలమైన నెట్‌వర్క్ ఎఫెక్ట్స్ సృష్టించాల్సిన అవసరం ఉందని ఎంపీ శ్రీభరత్ తెలిపారు. గతంలో హైదరాబాద్‌లో ప్రముఖ ఐటీ సంస్థల రాకతో ఏర్పడిన ఐటీ ఎకోసిస్టమ్ మాదిరిగానే, విశాఖపట్నంలోనూ పెద్ద సంఖ్యలో ఐటీ, టెక్నాలజీ సంస్థలు, స్టార్టప్‌లు, అనుబంధ సేవలు ఏర్పడేలా వాతావరణాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. విశాఖపట్నం అంతర్జాతీయ సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్‌కు అనుసంధానమయ్యే వ్యూహాత్మక ప్రదేశంగా ఉండటంతో డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాలకు అనుకూలమైన కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని శ్రీభరత్ అన్నారు. పెద్ద టెక్నాలజీ సంస్థల పెట్టుబడులు వచ్చినప్పుడు వాటి చుట్టూ ఫిన్‌టెక్, ఏఐ, సాఫ్ట్‌వేర్, డిజిటల్ సర్వీసెస్ వంటి అనుబంధ రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని తెలిపారు. తద్వారా ఉత్తరాంధ్ర యువతకు స్థానికంగానే ఉన్నత స్థాయి ఉద్యోగ, వ్యాపార అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. విశాఖపట్నం అభివృద్ధి, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి నీటి లభ్యతపై వస్తున్న ఆందోళనలపైనా ఎంపీ శ్రీభరత్ స్పందించారు. నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి వనరులు, సరఫరా మౌలిక వసతులను ముందుగానే బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గోదావరి జలాలను వినియోగించుకునే అవకాశం, పోలవరం ప్రాజెక్టు ద్వారా విశాఖ ప్రాంతానికి నీటి లభ్యతను పెంచే చర్యలు భవిష్యత్ అవసరాలకు భరోసా కల్పిస్తాయన్నారు. నగరాభివృద్ధి, పారిశ్రామికీకరణతో పాటు నీటి వనరుల సమర్థ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





