
US Visa | విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ సందర్శకులు, జర్నలిస్టులపై వీసా నిబంధనలను కఠినతరం చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయానికి అమెరికా కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. విదేశీయులు అమెరికాలో ఎంతకాలం ఉండవచ్చనే దానిపై పరిమితులు విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనను బోస్టన్లోని ఫెడరల్ న్యాయమూర్తి నిలిపివేశారు. ఈ నిబంధన అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎఫ్. డెన్నిస్ సేలర్ ఈ తీర్పు ఇవ్వడం గమనార్హం. కార్మిక సంఘాలు, ఉన్నత విద్యా రంగానికి చెందిన పలు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం.. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ఇచ్చిన వివరణలు సరిపోవని స్పష్టం చేసింది. విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ సందర్శకులు, జర్నలిస్టుల బస కాలాన్ని పరిమితం చేయడానికి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం జాతీయ భద్రత, వీసా వ్యవస్థలో మోసాలను అరికట్టడం వంటి కారణాలను చూపిందని జడ్జి తెలిపారు. అయితే ఈ విధాన మార్పు వల్ల తలెత్తే సమస్యలను సమర్థంగా పరిశీలించడంలో, తక్కువ కఠినమైన ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకోవడంలో ఆ శాఖ విఫలమైందని పేర్కొన్నారు. DHS ఇచ్చిన కారణాలను “అత్యంత బలహీనమైనవి”గా జడ్జి అభివర్ణించారు. కొత్త నిబంధన అమల్లోకి వస్తే దాదాపు ఐదు దశాబ్దాలుగా అమెరికాలో అమల్లో ఉన్న విధానంలో భారీ మార్పు వచ్చేది. ప్రస్తుతం విదేశీ విద్యార్థులు తమ విద్యా కార్యక్రమం కొనసాగుతున్నంత కాలం చట్టబద్ధంగా అమెరికాలో ఉండేందుకు అవకాశం ఉంది. అయితే ట్రంప్ ప్రభుత్వం జూలైలో తీసుకొచ్చిన కొత్త నిబంధనతో ఈ విధానాన్ని మార్చాలని నిర్ణయించింది. విదేశీ విద్యార్థులు, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల్లో పాల్గొనేవారికి నిర్దిష్ట కాలపరిమితి విధించడంతో పాటు జర్నలిస్టుల వీసాలపైనా పరిమితులు పెట్టాలని ప్రతిపాదించింది. F వీసా: విదేశీ విద్యార్థులకు గరిష్ఠంగా నాలుగేళ్ల పరిమితి J వీసా: సాంస్కృతిక, విద్యా మార్పిడి కార్యక్రమాల్లో పాల్గొనేవారికి నాలుగేళ్ల పరిమితి I వీసా: విదేశీ జర్నలిస్టులకు ప్రస్తుతం సంవత్సరాలపాటు కొనసాగుతున్న బసను 240 రోజులకు పరిమితం చేసే ప్రతిపాదన ప్రస్తుతం అమెరికాలో సుమారు 16 లక్షల మంది F వీసా కలిగి ఉండగా, మరో 5 లక్షల మంది J వీసాపై ఉన్నారు. ఎంఐటీ, హార్వర్డ్ వంటి ప్రముఖ పరిశోధనా విశ్వవిద్యాలయాల్లోనూ భారీ సంఖ్యలో విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా గ్రాడ్యుయేట్ స్థాయిలో చదువుతున్నారని జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే విదేశీ విద్యార్థుల చేరికలు తగ్గే అవకాశం ఉందని, ప్రముఖ విశ్వవిద్యాలయాలకు వందల మిలియన్ డాలర్ల వరకు అదనపు ఆర్థిక భారం పడే ప్రమాదం ఉందని న్యాయమూర్తి హెచ్చరించారు. విదేశీ విద్యార్థులు, పరిశోధకులు దశాబ్దాలుగా అమెరికా శాస్త్ర, వైద్య, సాంకేతిక రంగాల అభివృద్ధికి కీలకంగా దోహదపడ్డారని ఆయన గుర్తుచేశారు. వారి ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకూ గణనీయమైన ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు. “ఉన్నత విద్యా వ్యవస్థతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టం విపత్తు స్థాయిలో ఉండే అవకాశం ఉంది” అని జడ్జి సేలర్ హెచ్చరించారు. ఈ తీర్పుతో విదేశీ విద్యార్థులు, పరిశోధకులు, ఎక్స్ఛేంజ్ సందర్శకులు, విదేశీ జర్నలిస్టులపై ప్రతిపాదించిన వీసా కాలపరిమితులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే ట్రంప్ ప్రభుత్వం ఈ తీర్పుపై తదుపరి న్యాయపరమైన చర్యలకు వెళ్లే అవకాశం ఉంది.





