
నగర పోలీసులకు సమాచారమిచ్చిన యూఎస్‌ఏ పోలీసులు ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలో మెడికేర్‌ స్కీమ్‌ను దుర్వినియోగం చేసిన మోస్ట్‌ వాంటెడ్‌ నేరస్థుడు మహ్మద్‌ ఖదీర్‌ఖాన్‌ హైదరాబాద్‌ చేరినట్టు ఇక్కడి పోలీసులకు సమాచారం వచ్చింది. టెక్సాస్‌లోని రిచర్డ్‌సన్‌లో భారత పౌరుడు ఖదీర్‌ఖాన్‌ ‘అమెరికన్‌ ప్రీమియర్‌ ల్యాబ్స్‌’ అనే జన్యుపరీక్షల ల్యాబ్‌ను నిర్వహించాడు. అమెరికా ప్రభుత్వం జన్యుపరీక్షల నిర్వహణకు మెడికేర్‌ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఖదీర్‌ఖాన్‌ 2023 ఆగస్టు నుంచి 2024 అక్టోబరు మధ్యకాలంలో సుమారు 93 మిలియన్‌ డాలర్ల నకిలీ మెడికల్‌ క్లెయిమ్‌లను అమెరికా ప్రభుత్వానికి సమర్పించాడు. వీటిలో 65 మిలియన్‌ డాలర్లు(సుమారు రూ.620 కోట్లు) క్లెయిమ్‌ అయ్యాయి. దీని కోసం పరీక్షలను సిఫారసు చేసినట్లుగా వైద్యుల వివరాలు, సంతకాలను ఫోర్జరీ చేసినట్లు అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్, ఎఫ్‌బీఐ, హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ జరిపిన విచారణలో బయటపడింది. అతని బ్యాంకు ఖాతాల్లోని కొంత సొమ్మును అధికారులు ఫ్రీజ్‌ చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన టెక్సాస్‌ అధికారులు ఖదీర్‌ఖాన్‌ను పరారీలో ఉన్న మోస్ట్‌ వాంటెడ్‌ నేరస్థుల జాబితాలో చేర్చారు. అమెరికా నుంచి పారిపోయిన అతను ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నట్లు ఇక్కడి పోలీసు అధికారులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు విదేశాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం ద్వారా నగరానికి చేరిన వారి జాబితాను పరిశీలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




