
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Telangana SIR Voter List: తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, ముసాయిదా జాబితా విడుదల అంశాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 74 లక్షల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోనే దాదాపు 43 లక్షల వరకు ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.
రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 2,64,30,494 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సగటున 78.14 శాతం డిజిటలైజేషన్ నమోదైంది. అయితే జిల్లాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే గణనీయమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా 94.30 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, మెదక్, సూర్యాపేట జిల్లాల వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
మరోవైపు, హైదరాబాద్ జిల్లా కేవలం 58.58 శాతంతో చివరి స్థానంలో నిలవగా, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలు కూడా తక్కువ శాతంతో వెనుకబడి ఉన్నాయి. దాదాపు 40 లక్షల మంది ఓటర్లు తమ చిరునామాల్లో అందుబాటులో లేరని అధికారులు గుర్తించినట్లు సమాచారం.
ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. ముసాయిదా ప్రకటన వెలువడిన తర్వాత జాబితాలో పేర్లు లేని అర్హులైన ఓటర్లు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అంతేకాకుండా, కొత్తగా పేరు నమోదు చేసుకోవాలనుకునే వారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి తగిన వెసులుబాటు కల్పిస్తున్నారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాతే ఓట్ల తొలగింపుపై స్పష్టత వస్తుందని, అప్పటి వరకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు ఓట్ల తొలగింపు వ్యవహారం రాజకీయ పార్టీల్లో కొత్త టెన్షన్‌కు కారణమవుతోంది. ఈ ప్రక్రియను మొదటి నుంచీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయి నేతలను అప్రమత్తం చేశాయి. ప్రతీ నియోజకవర్గంలోనూ జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశాయి. ఆగస్టు 17న ముసాయిదా జాబితా వెలువడిన తరువాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఓటర్ల జాబితా వివరాలు, నమోదు ప్రక్రియ, ఇతర అధికారిక సమాచారం కొరకు ఓటర్లు భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ), ఓటర్స్ సర్వీస్ పోర్టల్‌లను కూడా సందర్శించవచ్చు. అలాగే ఓటర్ల జాబితాలో పేరును పరిశీలించడానికి ఎలక్ట్రోరల్ సెర్చ్ పోర్టల్‌ను ఉపయోగించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





