
ఇంటర్నెట్‌ డెస్క్‌: గురుగ్రామ్‌ (Gurugram)లో మహిళా బైకర్‌ సియాను కారు ఢీకొట్టిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బైక్‌పై వెళ్తోన్న సియాను ఓ కారు వెంబడించి ఢీకొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కారు నడిపిన కల్యాణ్ బైస్లా అనే వ్యక్తి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. సియా బైక్‌పై గంటకు 140 నుంచి 170 కిలోమీటర్ల వేగంతో వెళ్తోందని.. తాను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టలేదని చెప్పాడు. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్, ఫాలోవర్లు, పబ్లిసిటీ కోసమే ఆమె ఈ ఘటనను పెద్దది చేస్తోందని వాదించాడు. ఈ వాదనను సియా (Woman Biker) తీవ్రంగా ఖండించింది. అనుకోకుండా ప్రమాదం జరిగితే.. కారు ఎందుకు ఆపలేదని కల్యాణ్‌ బైస్లాను ఆమె ప్రశ్నించారు. మహిళా బైకర్‌ను కావడంతో అతడు ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టాడని ఆరోపించారు. కారు ఢీకొట్టిన తర్వాత కనీసం తాను సురక్షితంగా ఉన్నానా లేదా అని చూసే ప్రయత్నం కూడా చేయలేదని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోల్లో తన బైక్‌ను ఢీకొట్టి వెళ్లిపోవడం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ఈ మేరకు సియా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేశారు. నిందితుడు క్రిమినల్ మైండ్‌సెట్‌తోనే ఈ పని చేశాడని, మీడియా ముందు సాకులు చెప్తున్నాడని సియా కుటుంబసభ్యులు మండిపడ్డారు. పరారీలో ఉన్న కల్యాణ్ బైస్లాను గురుగ్రామ్ పోలీసులు రాజస్థాన్‌లోని దౌసా (Dausa)లో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తదుపరి విచారణ కోసం గురుగ్రామ్‌కు తరలిస్తున్నారు. అతడిపై హత్యాయత్నం (Attempt to Murder) కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





