
రూ.2,000 వరకు జరిపే UPI లావాదేవీలతో పాటు RuPay డెబిట్ కార్డ్ చెల్లింపులపై ఎలాంటి చార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 14న ఒక అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించేందుకు మరియు చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా చూసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు నేరుగా గానీ లేదా పరోక్షంగా గానీ ఎలాంటి చార్జీలు వసూలు చేయకూడదని ప్రభుత్వం ఉత్వర్వుల్లో పేర్కొంది. Payment and Settlement Systems Act, 2007 లోని సెక్షన్ 10A నిబంధనలకు అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. డిజిటల్ లావాదేవీల వ్యవస్థను విస్తరించడంలో భాగముగా ఈ నోటిఫికేషన్ ఎంతో కీలకంగా మారింది. ఈ నిబంధన పంపేవారికి మరియు స్వీకరించేవారికి సమానంగా వర్తిస్తుంది. అంటే కస్టమర్‌తో పాటు మర్చంట్ పై కూడా ఎలాంటి అదనపు రుసుములు ఉండవు. రూ.2,000 లోపు జరిపే UPI లావాదేవీలు, RuPay డెబిట్ కార్డ్ చెల్లింపులు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయి. సాధారణ వ్యక్తి నుండి వ్యక్తికి జరిగే P2P లావాదేవీలు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటాయి. రూ.2,000 లోపు ఉండే మర్చంట్ చెల్లింపులకు కూడా ఈ జీరో ఛార్జ్ నిబంధన వర్తిస్తుంది. దేశంలో జరిగే మొత్తం UPI లావాదేవీల వాల్యూమ్‌లో సుమారు 96 శాతం లావాదేవీలు ఈ రూ.2,000 పరిమితిలోనే ఉండటం విశేషం. రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిగే మర్చంట్ లావాదేవీలపై భవిష్యత్తులో MDR వసూలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, కన్జ్యూమర్పై ఎలాంటి ఛార్జీలు వేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజిటల్ చెల్లింపులు జరిపే వినియోగదారులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన ల్యాండ్‌మార్క్ ఆదేశాలను అందించింది.





