
Srinivas Goud | సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పీఆర్వో, పీఏపై దుండగుల దాడినిక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ముసుగులు ధరించిన వ్యక్తులు పోలీస్ స్టేషన్లోకి వచ్చి దాడి చేయడం పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటు అని విమర్శించారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్‌స్టేషన్‌లోనే ముసుగులు ధరించిన వ్యక్తులు దాడికి యత్నించారన్న ఆరోపణలు రావడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పండగ రోజున విచారణ కోసం కేటీఆర్ పీఆర్వో, పీఏను సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించిన సమయంలో సాయంత్రం సుమారు 6.30 గంటలకు దాదాపు 15 మంది ముసుగులు ధరించిన వ్యక్తులు ఇంటరాగేషన్ రూమ్‌లోకి వెళ్లి దాడికి యత్నించారని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు వారిని గుర్తించి అడ్డుకోవడంతో సదరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లోకి ముసుగులు ధరించి వచ్చి దాడికి ప్రయత్నించాల్సిన అవసరం ఏమొచ్చిందని శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. వారి వెనుక ఎవరున్నారు? వారికి ఎవరి మద్దతు ఉంది? అనే విషయాలను దర్యాప్తులో తేల్చాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాసంఘాలు, ఉద్యమ నాయకులు, ప్రజాప్రతినిధులపై జరిగిన దాడులను ఈ ఘటన గుర్తు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఘటన జరిగిన సమయంలో పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ప్రతి వ్యక్తి వివరాలను సేకరించాలని డిమాండ్ చేశారు. పోలీస్‌స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల పూర్తి ఫుటేజ్‌ను ఎలాంటి మార్పులు లేకుండా భద్రపరచాలని, అవసరమైన దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉంచాలని కోరారు. సీసీటీవీ దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలించి ఘటనకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. హోంశాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఘటనపై స్పందించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని శ్రీనివాస్‌గౌడ్ కోరారు. పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఘటనపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా దర్యాప్తు నిర్వహించాలని అన్నారు. ముసుగులు ధరించి వచ్చిన వ్యక్తులు ఎవరో గుర్తించి, ఘటన వెనుక ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావడంతో పాటు బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


