
రైలు ప్రయాణం వేగవంతమైంది... సౌకర్యాలు పెరిగాయి... అదే సమయంలో ఆపదలూ పెరిగాయి... ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలూ ముంచుకొస్తాయి... ఒక్క క్షణం నిర్లక్ష్యం... ప్రాణాలు తీసే అవకాశం ఉంది. కాస్తంత అజాగ్రత్త... నిలువుదోపిడీకి కారణం కావచ్చు... తస్మాత్‌ జాగ్రత్త! గతంతో పోలిస్తే రైళ్ల వేగమిప్పుడు బాగా పెరిగింది. 100-120 కి.మీ. వేగంతో దూసుకొస్తున్నాయి. వందేభారత్, శతాబ్ది వంటి రైళ్లయితే 150 కి.మీ.ల వేగాన్ని దాటేస్తున్నాయ్‌. అంటే సెకనుకు సుమారు 42 మీటర్ల దూరాన్ని దాటేస్తాయి. దూరంగా కనిపిస్తున్న రైలు దగ్గరకు రావడానికి ఎక్కువ సమయం ఉందని పట్టాలు దాటడం చాలా ప్రమాదకరం. 5 సెకన్లలోనే 200 మీటర్ల దూరాన్ని రైలు దాటేస్తుంది. సికింద్రాబాద్‌ జీఆర్పీ పరిధిలోనే వివిధ కారణాలతో ఏటా 1,300 మంది పట్టాలపై మరణిస్తున్నారు. స్టేషన్‌లో ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫాంపైకి వెళ్లేందుకు పట్టాలపై నడవొద్దు. ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి, లిఫ్టు, ఎస్కలేటర్లనే వాడాలి. ‘రైలు కన్పించట్లేదు. త్వరగా దాటేస్తాను’ అనే అంచనా ప్రమాదకరం. ఒక రైలు ఆగి ఉన్నప్పుడు దాని కింద నుంచి, మధ్యలో నుంచి వెళ్లడం మరింత ప్రమాదం. రైలు కోసం చూస్తున్నప్పుడు ప్లాట్‌ఫాం అంచుకు దూరంగా నిలబడాలి. ముఖ్యంగా పిల్లలు. రైలు పూర్తిగా ఆగాకే ఎక్కాలి. సామాన్లతో పరుగెత్తి రైలును అందుకోవడం, కదులుతున్న రైలెక్కడం, పూర్తిగా ఆగకముందే దిగడం ప్రమాదకరం. ఎంతోమంది ఇలా పట్టాల కింద పడి చనిపోతున్నారు. గేటు మూసుంటే దాటొద్దు. గేటు కింద నుంచి వెళ్లడం, పక్కకు తప్పించి దాటడం, రాంగ్‌సైడ్‌లో వాహనం నడపొద్దు. గేటు లేని క్రాసింగ్‌ వద్ద ఇరువైపులా చూసి, రైలు రాకపోకలు లేవని నిర్ధారించుకున్నాకే దాటాలి. ఒక రైలు వెళ్లిపోయిన వెంటనే ముందుకు వెళ్లకూడదు. మరో ట్రాక్‌పై నుంచి ఇంకో రైలు రావొచ్చు. రాత్రి ప్రయాణాల్లో కిటికీ పక్కన నిద్రించే మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలి. సిగ్నల్‌ కోసం రైలు ఆగే ప్రాంతాల్లో దొంగలు కాచుక్కూర్చుంటారు. గాలి కోసం కిటికీ తెరిస్తే.. మెడలో గొలుసులు లాక్కెళుతుంటారు. రాత్రివేళ ఒంటరిగా బాత్‌రూమ్‌కు వెళ్లొద్దు. తెలియని వ్యక్తులిచ్చే ఆహారం, పానీయాలను తీసుకోవద్దు. ప్రయాణానికి ముందే కోచ్, సీటు వివరాలు చూసుకోవాలి. పేరు, ఫోన్‌నంబరు వివరాలు ఉంచడం మంచిది. విలువైన వస్తువులు, నగదు, మొబైల్, నగలను ఎప్పుడూ దగ్గరలోనే ఉంచుకోవాలి. బ్యాగ్‌కు తాళం వేసి, లగేజీ చైన్‌తో భద్రపరచాలి. ఓవర్‌హెడ్‌ ర్యాక్‌లో విలువైన వస్తువులు ఉంచొద్దు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





