
ఇంటర్నెట్‌డెస్క్‌: దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ మేనేజర్‌ దిశా శాలియన్ మృతి కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray)కు రూ.500కోట్ల లీగల్ నోటీసు జారీ అయింది. ఆయనతో పాటు ఎన్‌సీపీ (ఎస్పీ), మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు కూడా ఈ నోటీసులు అందాయి. దిశ (Disha Salian) మృతి కేసులో న్యాయం కోసం చేస్తోన్న పోరాటాన్ని రాజకీయ ప్రేరేపితమైనదిగా చిత్రీకరించేందుకు వారు ప్రయత్నించారని ఆరోపిస్తూ ఆమె తండ్రి సతీశ్‌ ఈ నష్టపరిహారం కోరారు. 2020 జూన్ 8న ముంబయిలోని ఓ భవనంపై నుంచి పడి దిశ శాలియన్ (Disha Salian) మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె చనిపోయిన రోజుల వ్యవధిలోనే నటుడు సుశాంత్ తన ఫ్లాట్‌లో శవమై కనిపించారు. ఈ రెండు ఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఆ సమయంలో అధికారంలో ఉన్న ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం.. దిశ మృతి కేసును కప్పిపుచ్చేందుకు యత్నించిందనే ఆరోపణలు వచ్చాయి. హత్య, అత్యాచారంతో పాటు సుశాంత్‌ మృతితోనూ ముడిపెడుతూ ప్రచారం సాగింది. కానీ, తన కుమార్తె మృతిపై నాడు సతీశ్‌ ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. అయితే, తన కుమార్తె మృతి చెందిన రోజున ఇంట్లో ఆమె పార్టీ ఏర్పాటుచేసిందని.. దానికి ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray)తో పాటు ఆయన బాడీగార్డులు, నటులు సూరజ్‌ పంచోలి, డినో మోరియా, మరికొందరు హాజరయ్యారని ఇటీవల కోర్టులో వేసిన పిటిషన్‌లో సతీశ్ పేర్కొన్నారు. దిశపై సామూహిక అత్యాచారం జరిగిందని చెప్పేందుకు తమవద్ద సాక్ష్యాలున్నాయని కేసు వాదిస్తోన్న లాయర్ వ్యాఖ్యలు చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ పరిణామాలతో ఆరేళ్ల తర్వాత ఈ కేసు దర్యాప్తు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. ఈ క్రమంలోనే పరువు నష్టం కలిగించేలా చేసిన వ్యాఖ్యలకుగానూ ఆదిత్య ఠాక్రే, అనిల్‌ దేశ్‌ముఖ్ క్షమాపణలు చెప్పాలని సతీశ్‌ డిమాండ్ చేశారు. ప్రధాన మీడియాలో వాటిని ప్రచురించి, ప్రసారం చేయాలని కోరారు. ఆ క్షమాపణలను వారు తమ అధికారిక సోషల్ మీడియాలో పోస్టు చేయాలని ఆ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు తనపై వస్తోన్న ఆరోపణలను ఆదిత్య తోసిపుచ్చారు. దిశా శాలియాన్‌ (Disha Salian)ను తాను ఎప్పుడూ కలవలేదని, ఆమె ఎవరో కూడా తెలియదని పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




