
Remittances : విదేశాలలో స్థిరపడిన భారతీయులు (NRIs) తమ మాతృభూమికి పంపే నగదు (Remittances) గడిచిన దశాబ్దకాలంలో గణనీయంగా పెరిగింది. ఈ విషయంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది భారత్కు ఏకంగా 151 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు (దాదాపు రూ.14.47 లక్షల కోట్లు) అందాయని ఐక్యరాజ్యసమితి (UNO) కి చెందిన ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (IFAD) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 2016లో ఈ రెమిటెన్సులు 63 బిలియన్ డాలర్లుగా ఉండగా.. పదేళ్ల వ్యవధిలో ఏకంగా రెండున్నర రెట్లు పెరగడం గమనార్హం. ఇది ప్రవాస భారతీయులు తమ కుటుంబాలకు వ్యక్తిగతంగా పంపే సొమ్ము మాత్రమేనని, ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (FDIs) లేదా ఇతర సంస్థాగత బదిలీలు ఇందులో కలవవని నివేదిక స్పష్టంచేసింది. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది మొత్తం రెమిటెన్సులు 728.6 బిలియన్ డాలర్లకు చేరాయి. భారత్లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ బలంగా ఉండటమే ఈ వృద్ధికి దోహదపడిందని ఐఎఫ్ఏడీ ప్రశంసించింది. ముఖ్యంగా ఆధార్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వంటి వ్యవస్థల ద్వారా లబ్ధిదారులకు సులభంగా, వేగంగా డబ్బు చేరుతోందని పేర్కొన్నది. బలమైన దేశీయ డిజిటల్ పునాదుల విలువకు ఇది నిదర్శనమని తెలిపింది. “ఈ నిధులు కేవలం కుటుంబాల ప్రాథమిక అవసరాలు తీర్చడానికే కాకుండా.. ఆర్థిక వృద్ధికి, సంక్షోభ సమయాల్లో నిలదొక్కుకోవడానికి కూడా సహాయపడతాయి” అని ఐఎఫ్ఏడీ ప్రెసిడెంట్ అల్వారో లారియో అన్నారు. సరైన ఆర్థిక సేవలు అందుబాటులో ఉన్నప్పుడే ఈ నిధుల ప్రయోజనాలు మరింత ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. డబ్బు పంపడమే కాకుండా, ప్రవాస భారతీయులు తమ నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార సంబంధాల ద్వారా కూడా దేశాభివృద్ధికి తోడ్పడుతున్నారని నివేదిక వివరించింది. భారత్కు వస్తున్న రెమిటెన్సులలో గల్ఫ్ దేశాల వాటానే అధికమని, ఇది ఒకేసారి అవకాశం, సవాలు కూడా అని హెచ్చరించింది. ఆయా దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు తగ్గితే దాని ప్రభావం కార్మికులు, వారి కుటుంబాలపై పడుతుందని సూచించింది. అయినప్పటికీ ఇటీవలి సంక్షోభాలను తట్టుకుని రెమిటెన్సుల ప్రవాహం స్థిరంగా కొనసాగుతోందని నివేదికలో పేర్కొన్నారు.





