
బోదులూరు పీహెచ్‌సీలో పనిచేయని ఇన్వెర్టర్లు చరవాణి వెలుగులో వైద్యసేవలు అందిస్తున్న ఏఎన్‌ఎం న్యూస్‌టుడే, మారేడుమిల్లి: గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రధానమైన గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోగులు, సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. మారేడుమిల్లి మండలంలో మారేడుమిల్లి, బోదులూరులో పీహెచ్‌సీలు ఉన్నాయి. బోదులూరు పీహెచ్‌సీలో సౌకర్యాల కొరత వేధిస్తోంది. లోతట్టు ప్రాంతం కావడంతో విద్యుత్తు సరఫరా అంతంతమాత్రంగానే ఉంటోంది. తరచూ విద్యుత్తు సరఫరా నిలిచిపోతుండడంతో రోగులు చీకట్లోనే కాలంవెళ్లదీస్తున్నారు. పీహెచ్‌సీలో మూడు ఇన్వెర్టర్లకుగాను రెండు పనిచేయడం లేదు. ఒక ఇన్వెర్టర్‌ను వ్యాక్సిన్లు, మందులు భద్రపరిచే గదికి వినియోగిస్తున్నారు. జనరేటర్‌ అందుబాటులో లేదు. రెండు ఇన్వెర్టర్లు పనిచేయక పోవడంతో వైద్యుల గదులు, రోగుల వార్డులు అంధకారంలోనే ఉంటున్నాయి. అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఈ పీహెచ్‌సీకి ప్రహరీ కూడా లేదు. బోదులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రమాదాల్లో క్షతగాత్రులు, గర్భిణులు అత్యవసరంగా రాత్రి వేళల్లో వస్తుంటారు. ఆ సమయంలో విద్యుత్తు సరఫరా లేకుంటే చరవాణి దీపాల వెలుతురులోనే వైద్య సేవలు అందించాల్సిన దుస్థితి నెలకొంది. రాత్రి సమయంలో తరచూ విద్యుత్తు సరఫరా నిలిచిపోతుంటుంది. ఈ నెల 12న బోదులూరు సమీపంలో లారీని ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఇదే పీహెచ్‌సీకి తరలించారు. అదే సమయంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది సెల్‌ఫోన్ల వెలుగులోనే వైద్య సేవలు అందించాల్సి వచ్చింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





