
సినిమా రివ్యూల మీద నిర్మాతలు, హీరోలు, దర్శకులు లేదా ఆ సినిమాకి పని చేసిన వారు ఎవరో ఒకరు కామెంట్లు చేయడం కామన్. ఈ మధ్యకాలంలో వచ్చిన ఓ సినిమా నిర్మాత మాత్రం ఒక అడుగు ముందుకేసి, తాము ప్రభాస్‌తో చేయబోతున్న సినిమాని దమ్ముంటే రివ్యూలతో ఆపండి అంటూ సవాల్ విసిరారు. నిజానికి ఏ సినిమా బాక్సాఫీస్ ఫలితాన్ని రివ్యూలు ప్రభావితం చేయలేవు. నిజానికి తెలుగు సినీ పరిశ్రమ విషయానికి వస్తే, రివ్యూయర్లుగా భావిస్తూ తమ అభిప్రాయాన్ని మీడియా సంస్థల ప్రతినిధులుగానో లేక తమ సొంత యూట్యూబ్ లేదా ట్విట్టర్ అకౌంట్ల ద్వారానో వ్యక్తపరిచే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వ్యక్తపరిచిన అభిప్రాయం కొంతవరకు మాత్రమే ప్రేక్షకులను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే, వాళ్లు బాలేదన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అలా అని కాదు, సినిమా అద్భుతంగా ఉంది అన్నా కూడా బాక్సాఫీస్ వద్ద ఆ రిజల్ట్ కనిపించని సినిమాలు కూడా ఉన్నాయి. మొత్తంగా చూస్తే, ఈ రివ్యూలు అనేవి కొంతమంది వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప, సినిమా స్థాయిని తగ్గించే సత్తా ఆ రివ్యూలకి ఉందని ఎవరూ అనలేరు. అసలు విషయానికి వస్తే, సందీప్ రెడ్డి వంగా సోదరుడు, తన సోదరుడి దర్శకత్వంలో కాకుండా మరో వ్యక్తి దర్శకత్వంలో ‘రోమాంచకం’ సినిమా చేశారు. ఆ సినిమా కంటెంట్ పరంగా రివ్యూయర్లకు కొంత కంప్లైంట్స్ ఉండి ఉండవచ్చు. ఆ సినిమా నచ్చి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిన వారు ఉన్నారు, నచ్చక తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వారు ఉన్నారు. అలాంటి వాళ్ళని ఛాలెంజ్ చేస్తూ, “ప్రభాస్ ‘స్పిరిట్’ స్థాయిని తగ్గించగలరా?” అంటూ ఆయన మాట్లాడటం ఆసక్తికరం. వాస్తవానికి ఏ రివ్యూ రైటర్ కూడా ఏ సినిమా స్థాయిని తగ్గించలేడు, అలా అని పెంచలేడు. సినిమా గురించి నాలుగు మంచి మాటలు చెబితే ప్రేక్షకుడు సినిమా మీద ఆసక్తి కనబరిచి సినిమాకి వెళతాడేమో. ఆ సినిమా తనకు నచ్చలేదని చెబితే అసలు నచ్చని విషయాలు ఏమున్నాయి అని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఇప్పుడు థియేటర్లలోకి వెళుతున్నారు. ఒకవేళ ప్రేక్షకుడు సినిమాకి వెళ్లాలని ఫిక్స్ అయితే, రివ్యూ పాజిటివ్ వచ్చినా, నెగిటివ్ వచ్చినా పట్టించుకోడు. ఆ సినిమా థియేటర్‌కి రప్పించుకోగలగడం సినిమా దర్శక నిర్మాతలతో పాటు హీరో హీరోయిన్ల ప్రమోషన్ల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఛాలెంజ్‌ల కన్నా ఆ కంటెంట్ మీద ఫోకస్ చేస్తే బెటర్ అని చెప్పొచ్చు.




