
క్యాబ్‌ అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశం దిల్లీ: క్యాబ్‌ సేవలు అందించే ప్లాట్‌ఫామ్‌ల్లో, బుకింగ్‌కు ముందే ప్రయాణికుల నుంచి అదనంగా వసూలు చేసే ‘అడ్వాన్స్‌ టిప్పింగ్‌’ ఫీచర్‌కు తక్షణమే స్వస్తి పలకాలని క్యాబ్, బైక్‌- ట్యాక్సీ అగ్రిగేటర్లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ తరహా పద్ధతులు వినియోగదారులను తప్పుదోవ పట్టించడమే కాకుండా, అనైతిక వ్యాపార పద్ధతుల కిందకు వస్తాయని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే బుధవారం స్పష్టం చేశారు. ముందస్తు టిప్‌లపై నేషనల్‌ కన్జూమర్‌ హెల్ప్‌లైన్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని సెంట్రల్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ అధారిటీ (సీసీపీఏ) చీఫ్‌ కూడా అయిన నిధి ఖరే తెలిపారు. టిప్‌ ఇస్తేనే రైడ్‌ దొరుకుతుందన్నట్లుగా వినియోగదారులను ఒత్తిడికి గురిచేయడం నిబంధనలకు విరుద్ధమని, సమగ్ర విచారణ అనంతరం, ఈ పద్ధతులను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. టిప్‌ ఇవ్వడం పూర్తిగా వినియోగదారుడి ఇష్టమని, ప్రయాణం ముగిసిన తర్వాత అందించిన సేవలు నచ్చితేనే.. ఇవ్వాల్సిన అంశమని పేర్కొన్నారు. ర్యాపిడోపై రూ.10 లక్షల జరిమానా: రోపెన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సర్వీసెస్‌ (ర్యాపిడో)పై సీసీపీఏ రూ.10 లక్షల జరిమానా విధించింది. రైడ్‌ బుకింగ్‌ జరుగుతుండగానే యాప్‌లో ‘ధర ఎంత ఎక్కువ ఉంటే, రైడ్‌ దొరికే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది’, ‘కెప్టెన్లు రూ.60 వద్ద అంగీకరించడం లేదు, రూ.10, రూ.20, రూ.30 అదనంగా జోడించడానికి ప్రయత్నించండి’ వంటి సందేశాలు చూపించడాన్ని సీసీపీఏ తప్పుబట్టింది. మొదట ఒక ఛార్జీ చూపించి, బుకింగ్‌ చేశాక ఆ ధరకు డ్రైవర్లు రావడం లేదంటూ ఎక్కువ డబ్బులు అడగడం వినియోగదారుల్లో ఆందోళనను, రైడ్‌ దొరకదనే భయాన్ని సృస్టిస్తుందని, ఇది డార్క్‌ ప్యాటర్న్స్‌ కిందకు వస్తుందని సీసీపీఏ పేర్కొంది. దూరం, సమయం, ట్రాఫిక్, టోల్స్, డ్రైవర్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని లెక్కించే.. బుకింగ్‌ సమయంలో ఛార్జీ చూపిస్తారు కాబట్టి, ప్రయాణం మొదలుకాకముందే మళ్లీ అదనంగా అడగడానికి ఎటువంటి సమర్థన లేదని స్పష్టం చేసింది. ఉబర్, ఓలా సంస్థలు అనుసరిస్తున్న అడ్వాన్స్‌ టిప్పింగ్, డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానాలపైనా సీసీపీఏ విచారణ కొనసాగుతోంది. డార్క్‌ ప్యాటర్న్స్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఇప్పటికే ఉబర్, ఓలా, ర్యాపిడో, నమ్మయాత్రి ప్లాట్‌ఫామ్‌లకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





