
చెన్నైలోని డాక్టర్ ఎం.జి.ఆర్. ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 36వ స్నాకోత్సవంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీలు పూర్తి చేసుకున్న జెన్ Z, జెన్ ఆల్ఫా యువతను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. యువత దేశం తమ కోసం ఏమి చేస్తుందని ఎదురుచూడకుండా, తాము దేశం కోసం ఏమి చేయగలరో ఆలోచించాలని పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, ముందంజలో ఉండి నాయకత్వం తీసుకోగలగాలని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. మన దేశం సురక్షితంగా, బలంగా ఉన్నప్పుడే మనకు నివసించడానికి ఒక ఇల్లు ఉంటుందని గుర్తుచేశారు. వివిధ దేశాల్లో జరుగుతున్న యుద్ధాల వల్ల ప్రజలు తమ సొంత ఇళ్లను కోల్పోయి నిర్వాసితులుగా మారుతున్న పరిస్థితులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాబట్టి యువత దేశాన్ని ఎప్పటికీ వీడకూడదని, దేశ సంక్షేమాన్నే మొదటి ప్రాధాన్యంగా ఉంచుకోవాలని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరియు మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఘర్షణల వల్ల చమురు, గ్యాస్, ఎరువుల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇలాంటి క్లిష్టమైన అంతర్జాతీయ పరిస్థితులు ఉన్నప్పటికీ, భారత్ మాక్రో ఎకనామిక్ స్థిరత్వాన్ని కాపాడుకుంటూ 7.8 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేసిందని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రం పారిశ్రామిక, సాంకేతిక రంగాలు రెండింటిలోనూ గ్లోబల్ హబ్‌గా వేగంగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి వివరించారు. శ్రీపెరంబుదూర్-ఒరగడం కారిడార్ ప్రస్తుతం ప్రపంచ స్థాయి ఆటోమొబైల్, స్మార్ట్‌ఫోన్ ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా మారిందని వెల్లడించారు. భారత్‌లోని మొత్తం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లలో దాదాపు 10 శాతం తమిళనాడులోనే ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 350 వరకు ఇటువంటి సెంటర్లు ఉండగా, ఒక్క కోయంబత్తూరులోనే 80 సెంటర్లు పనిచేస్తూ 12,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాయని చెప్పారు. మధురై, తిరుచిరాపల్లి ప్రాంతాల్లో కూడా ఇవి వేగంగా విస్తరిస్తున్నాయని వివరించారు. STEM రంగాల్లో మహిళా భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించడానికి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. దీనిలో భాగంగా ప్రతి జిల్లాలో ఉద్యోగాల కోసం వచ్చే మహిళల కోసం ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేయడానికి బడ్జెట్ మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. స్నాకోత్సవంలో ప్రసంగిస్తూ తిరుక్కురళ్‌లోని ప్రాముఖ్యత కలిగిన పద్యాలను ఉటంకించారు. విద్య అనేది ఎప్పటికీ తరగని శాశ్వతమైన సంపద అని, ప్రతి ఒక్కరూ ఓపికగా ఉండాలని కోరారు. విద్యార్థులు అహంకారాన్ని, బాధితులమనే భావనను పూర్తిగా వదిలిపెట్టాలని సూచించారు. వినమ్రతతో ఉంటూ, బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని గ్రాడ్యుయేట్లకు పిలుపునిచ్చారు. ఈ స్నాకోత్సవంలో వైద్యం, ఇంజనీరింగ్, లా, మేనేజ్మెంట్ సహా పలు విభాగాలకు చెందిన 3,200 మందికి పైగా విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కూడా పాల్గొన్నారు.




