
రూ. 21.65 కోట్లకు లెక్కల్లేవ్‌ ఐదేళ్లలో ఇష్టానుసారంగా నిధుల వ్యయం న్యూస్‌టుడే, కర్నూలు జడ్పీ : జిల్లా పరిషత్‌ నిధులు గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున పక్కదారి పట్టాయి. ఇష్టానుసారంగా నిధులు వెచ్చించారు. రూ.21.65 కోట్లకు లెక్కల్లేవు. ఆడిట్‌ శాఖ అభ్యంతరాలు లేవనెత్తినా అధికారులు సమాధానాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు, జడ్పీ ఖజానాకు చేరిన సాధారణ నిధులను వ్యయం చేయడంలో నిబంధనలు పాటించ లేదని, ఇష్టమొచ్చినట్లుగా వినియోగించారని ఆడిట్‌ అధికారులు లెక్కలు తేల్చారు. 2020- 21 నుంచి 2024- 25 వరకు ఆడిట్‌ అధికారులు చేపట్టిన తనిఖీల్లో 168 అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రూ.21.63 కోట్ల ఖర్చుకు లెక్కలు చూపలేదు. గత నాలుగేళ్లుగా ఆడిట్‌ అభ్యంతరాలకు జడ్పీ అధికారులు ఏమాత్రం సమాధానం ఇవ్వడం లేదు. ప్రస్తుతం జిల్లా పరిషత్‌ పాలకవర్గం పదవీకాలం ఈనెల 24వ తేదీతో ముగియనుంది. 8 2022- 23లో జడ్పీకి రూ.11.47 కోట్ల ఆదాయం (సాధారణ నిధులు), ఆర్థిక సంఘం ద్వారా రూ.24 కోట్ల నిధులు సమకూరాయి. ఈ ఏడాది రూ.3.10 కోట్ల ఖర్చుకు లెక్కలు తేలడం లేదు. వీటిలో ప్రధానంగా ఇయర్‌ మార్క్‌ఫండ్‌ కింద రూ.2.79 కోట్ల నిధులు కేటాయించినా, సంబంధిత శాఖలు వినియోగించలేకపోయాయని ఆడిట్‌ అధికారులు పేర్కొన్నారు. పాత బకాయిలు రూ.2.43 లక్షలు వసూలు చేయలేదు. నిబంధనలు అతిక్రమించి రూ.29.18 లక్షలు వ్యయం చేశారని, ఇందుకు దస్త్రాలు, రసీదులు లేకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. 8 2023- 24లో రూ.10.73 కోట్లు (సాధారణ నిధులు), 15 ఆర్థిక సంఘం ద్వారా రూ.24 కోట్లు నిధులు వచ్చాయి. రూ.2.09 కోట్లను వాడేసి లెక్కలు చూపలేదు. నోటీసులు జారీచేసినా స్పందన లేదు. నిబంధనలు అతిక్రమించి రూ.64.86 లక్షలు వ్యయం చేశారు. స్టేషనరీ, జడ్పీ సమావేశాల నిర్వహణ, వాహన మరమ్మతులు తదితర వాటికి బిల్లులు సమర్పించలేదు. 8 2024- 25లో జడ్పీకి సాధారణ నిధులు రూ.11.29 కోట్లు, 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.18 కోట్లు సమకూరాయి. ఇయర్‌ మార్క్‌ఫండ్‌ కింద కేటాయించిన రూ.3.60 కోట్లు వినియోగించ లేదని, ఏఏ శాఖకు ఎంత కేటాయించారనే వివరాలు స్పష్టంగా వెల్లడించలేదని ఆడిట్‌ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి లెక్కాపత్రాల్లేకుండా జడ్పీ ఖజానా నుంచి రూ.52.22 లక్షలు వాడేశారు. మరో రూ.65,107 వ్యయానికి కూడా లెక్కలు చూపలేదు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





