
కైఫీయత్‌లో ఉందేమో చూడండి మీ ఊరి పేరెలా వచ్చింది? ఎవరు పాలించారు? దేవాలయాలు ఎవరు నిర్మించారు? వాటికి భూములెవరిచ్చారు? అనే వివరాలు తెలుసా? అ యితే మెకంజీ కైఫీయత్‌లు వెతకండి. అందులో మీ ఊరూ ఉండొచ్చు. పూర్వ చరిత్ర తెలుసుకోవచ్చు. వాటిని చదవాలంటే కొద్దిగా కష్టపడాలి. ఎందుకంటే అవి గ్రాంథిక భాషలో ఉంటాయి. కొన్నిటిలో సంస్కృత శ్లోకాలు, మరికొన్నిటిలో తెలుగు పద్యాలు కూడా కన్పిస్తాయి. ఆన్‌లైన్‌లో కైఫీయత్‌లు అని కొడితే.. బోలెడంత సమాచారం మీ ముందుకు వస్తుంది. అందులో 17, 18వ శతాబ్దాల కాలంలో రాసిన పుస్తకాలూ ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని గ్రామాల సమాచారం ఉంటుంది. కైఫీయత్‌ అనే దానికి మూలం అరబిక్‌ .. కైఫ్‌ అనే పదం నుంచి వచ్చింది. అరబిక్‌లో కఫ్‌ అంటే ‘పరిస్థితి ఏంటి’ అని అర్థం. తర్వాత ఉర్దూ, పర్షియన్‌లోకి చేరింది. తర్వాత కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీ, ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలనలో గ్రామ కరణాలు రాసే దండకవిలెలు, గ్రామ వివరాల నివేదికల్ని ఈ పేరుతో పిలుస్తున్నారు. గ్రామానికి సంబంధించిన పూర్తి ఆర్థిక, సామాజిక, రాజకీయ సమాచారాన్ని సమగ్రంగా క్రోడీకరించి రాసిన ప్రధాన రికార్డు పుస్తకం.. గ్రామలవారీగా కరణాలు తరాలుగా రాసిన చరిత్ర ఇందులో ఉంటుంది. తాటి ఆకులపై ఘటంతో రాసి కట్టలుగా కట్టిన తాళపత్ర గ్రంథాలూ వీటిలో ఉంటాయి. రా జ్యాలు, అప్పటి పరిస్థితుల గురించి మాత్రమే చరిత్ర చెబుతుంది. దండ కవిలెలు/గ్రామ కైఫీయత్‌లు గ్రామాల్లో ప్రజల జీవన విధానం, ఆర్థిక పరిస్థితులు, నాటి న్యాయ వ్యవస్థ, సంస్కృతిని వివరిస్తాయి. ఈ స్ట్‌ ఇండియా కంపెనీ తరఫున, బ్రిటిష్‌ పాలనలో భారతదేశ మొదటి సర్వేయర్‌ జనరల్‌గా పనిచేసిన కల్నల్‌ కొలిన్‌ మెకంజీ వీటిని తయారు చేయించారు. వట్టిచెరుకూరు భూములకు మోక్షం గుం టూరు జిల్లా వట్టిచెరుకూరులో ఇళ్లస్థలాలు గ్రామకంఠంలోనే ఉన్నా.. అధికారులు వాటిని 22ఎ పరిధిలో చేర్చారు. వాటిని తొలగించాలని 120 ఏళ్లకు పైగా గ్రామస్థులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. 1722 సంవత్సరంలోనే అక్కడ ఊరు ఉందని కైఫీయత్‌ల ద్వారానే వెల్లడైంది. దాని ఆధారంగా ఇటీవలే ప్రభుత్వం వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించి అక్కడి ప్రజలకు ఊరట కలిగించింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




