
రాష్ట్ర రాజకీయాల్లో సొంత పార్టీ తెలంగాణ రక్షణ సేనను బలోపేతం చేసుకునే దిశగా ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత శరవేగంగా అడుగులు వేస్తున్నారు. సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన ఆమె, తాజాగా వినాయక చతుర్థి శుభసందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ పరంగా పలు కీలక నియామకాలను చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 18 కీలక అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జులను ఖరారు చేయడంతో పాటు, పలు జిల్లాలకు నూతన అధ్యక్షులను, అనుబంధ విభాగాల వారీగా బాధ్యులను నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ తాజా జాబితాతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలోని మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఇన్చార్జుల నియామకం పూర్తయినట్లయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన పటాన్చెరు, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, నాంపల్లి, అంబర్పేట్, ఇబ్రహీంపట్నంతో పాటు ఉత్తర, దక్షిణ తెలంగాణలోని ఆదిలాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఖానాపూర్, నిర్మల్, హుజూరాబాద్, దేవరకొండ, ఇల్లందు, అశ్వారావుపేట నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జులను నియమించారు. దీనికి తోడు మెదక్ లోక్సభ స్థానానికి కూడా పార్టీ అధ్యక్షుడిని ప్రకటించడం ద్వారా తెలంగాణ రక్షణ సేన రాబోయే ఎన్నికల వ్యూహానికి సమరశంఖం పూరించినట్లయింది.





