
Saudi : యెమెన్ (Yemen) విషయంలో అమెరికా (USA) అనూహ్యమైన అడుగేసింది. ఇరాన్ (Iran) మద్దతున్న హౌతీ రెబల్స్ (Hauthi rebels) తో ఒమన్ (Oman) లో రహస్యంగా సమావేశమైంది. ఈ చర్చల తర్వాత హౌతీల దూకుడును అడ్డుకోవడానికి సౌదీ అరేబియా (Saudi Arabia) కు ఎలాంటి ప్రత్యక్ష సైనిక మద్దతు ఇవ్వరాదని ట్రంప్ ప్రభుత్వం (Trump govt) నిర్ణయించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ చర్చలకు సంబంధించి బయటకు వచ్చిన నివేదికల ప్రకారం.. ఒమన్లోని మస్కట్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంలో గడిచిన వారాంతంలో ఈ భేటీ జరిగింది. ప్రాంతీయ మధ్యవర్తిగా ఒమన్ ప్రభుత్వం ఈ చర్చలకు సహకరించింది. ఈ సమావేశంలో అమెరికా తరఫున ఎంబసీ అధికారులు పాల్గొనగా.. హౌతీల నుంచి మహ్మద్ అబ్దుల్ సలాం (అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న వ్యక్తి), అబ్దుల్ మాలిక్ అల్ అజిరి వంటి సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. అమెరికా నౌకలపై దాడిచేసే ఉద్దేశం తమకు లేదని, 2025లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని హౌతీలు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇజ్రాయెల్ లేదా ఇతర వాణిజ్య నౌకలను కూడా లక్ష్యంగా చేసుకోబోమని హౌతీలు చెప్పినట్లు తెలిసింది. అయితే తమ దేశంపై సౌదీ దిగ్బంధనం విధించినందున, సౌదీకి సంబంధించిన నౌకలకు ఈ హామీ వర్తించదని స్పష్టంచేశారు. ఇటీవల ఎర్ర సముద్ర తీరంలో హౌతీలు కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో.. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అమెరికా సైనిక సహాయం కోరారు. అయితే హౌతీలతో తాము నేరుగా సంప్రదింపులు జరుపుతున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇప్పటికే ధ్రువీకరించారు. తాజా భేటీతో సౌదీ అభ్యర్థనను అమెరికా తిరస్కరించినట్లయింది. ఈ పరిణామంతో దౌత్య మార్గాలను అన్వేషించాల్సిన ఒత్తిడి సౌదీ అరేబియాపై పెరిగింది.





