
ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌ ( Iran )తో యుద్ధం అమెరికా రక్షణ రంగంపై తీవ్ర ప్రభావం చూపినట్లు పెంటగాన్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఓ నివేదికలో వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 వరకు జరిగిన నష్టాలను నివేదికలో పొందుపరిచారు. అమెరికాలో అధునాతన ఆయుధాల నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని.. వాటిని భర్తీ చేయడంలో అనేక అడ్డంకులు ఉన్నాయని పేర్కొన్నారు. యుద్ధానికి ముందు ఉన్న స్థాయికి.. వీటిని తీసుకురావడానికి సుమారు మూడేళ్లు పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. దాడుల్లో అమెరికా దౌత్య కార్యాలయాలకు జరిగిన నష్టాన్ని నివేదిక తొలిసారిగా వెల్లడించింది. ఇరాక్‌, కువైట్‌, సౌదీ అరేబియా, యూఏఈలోని దౌత్య కార్యాలయాలకు సుమారు 184 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. యుద్ధం నేపథ్యంలో దాదాపు 9000 మంది అమెరికా పౌరులను వివిధ దేశాల నుంచి స్వదేశానికి తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఈ తరలింపునకు జూన్‌ చివరి నాటికి 11 మిలియన్‌ డాలర్లకుపైగా ఖర్చయినట్లు వెల్లడించింది. ‘ఇరాన్‌ దాడులతో కువైట్‌, బహ్రెయిన్‌, ఖతార్‌, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్‌, ఒమన్‌, జోర్డాన్‌లలోని అమెరికా సైనిక స్థావరాల్లో వందలాది భవనాలు దెబ్బతిన్నాయి. భారీగా అమెరికా విమానాలు, డ్రోన్లు ధ్వంసమయ్యాయి. యుద్ధానికి ఇప్పటివరకు 37.5 బిలియన్‌ డాలర్లు ఖర్చయింది’ అని రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సెత్‌ (Pete Hegseth) కాంగ్రెస్‌కు తెలిపారు. హర్మూజ్‌ జలసంధిలో (Strait of Hormuz) పనామా జెండాతో ప్రయాణిస్తోన్న ఓ చమురు ట్యాంకర్‌పై దాడి ఘటనకు సంబంధించి అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి వివాదం తలెత్తింది. నావికా దళం అమర్చిన మైన్‌ను ట్యాంకర్‌ ఢీకొట్టిందంటూ ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ (IRGC) చేసిన వాదనను అమెరికా సైన్యం ఖండించింది. కావాలనే నౌకను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని ఆరోపించింది. ఈ నౌకపై ఇరాన్‌ రెండుసార్లు దాడి చేసిందని అమెరికా సెంట్రల్‌కమాండ్‌ (CENTCOM) పేర్కొంది. తాజా పరిణామంతో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





