
రైల్లో ప్రయాణించే సమయంలో ఏదైనా సమస్య ఉంటే ఎవరికి ఫిర్యాదు చేయాలనే దానిపై చాలామందికి అవగాహన ఉండదు. ట్రైన్లో ప్రయాణించేటప్పుడు సౌకర్యాలపై ఎలాంటి సమస్య ఉన్నా రైల్వేశాఖకు ఫిర్యాదు చేయవచ్చు. మీ మొబైల్ నుంచే ఆన్లైన్ ద్వారా రైల్వే అధికారులకు కంప్లైంట్ చేసే సదుపాయం ఉంది. ఇందుకోసం రైల్ మదద్ అనే యాప్‌ను రైల్వేశాఖ అందుబాటులో ఉంచిది. ఈ యాప్ ద్వారా ట్రైన్లలో మీకు ఏదైనా ఇబ్బంది ఎదురైనా ఫిర్యాదు చేయవచ్చు. రైలు బోగీల్లో నీటి కొరత ఉన్నా, శుభ్రంగా లేకపోయినా, ఆహారం బాలేకపోయినా.. ఇలాంటి అన్ని సమస్యలపై కంప్లైంట్ చేయవచ్చు. అయితే రైల్ మదద్ యాప్ సేవలను మరింత మెరుగుపర్చేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సమస్యలు సులభంగా పరిష్కరించేందుకు ఫ్లాట్‌ఫామ్‌లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుంది.




