
డిజైన్‌ చేసిన ఐఐటీ హైదరాబాద్‌ రూ.15 కోట్లతో 6 నెలల్లో పూర్తికి అనుమతులు ఈనాడు, హైదరాబాద్‌: మెట్రోరైలు స్టేషన్ల నుంచి నేరుగా మాల్స్‌కు, కార్యాలయాలకు చేరుకునేందుకు స్కైవాక్స్‌ ఇప్పటికే ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఒక రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌నకు అనుసంధానం చేస్తూ స్కైవాక్‌ నిర్మించబోతున్నారు. ఎల్బీనగర్‌ మెట్రోరైలు స్టేషన్‌ నుంచి పక్కనే 3,576 ఫ్లాట్లతో నిర్మితమవుతున్న వాసవి ఆనంద నిలయం గేటెడ్‌ కమ్యూనిటీకి నేరుగా చేరుకునేందుకు వీలుగా నిర్మించే స్కైవాక్‌ నిర్మాణానికి చట్టబద్ధ అనుమతులు లభించాయని వాసవి గ్రూప్‌ సీఎండీ యెర్రం విజయ్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ట్రాఫిక్‌ పోలీసుల నుంచి ఎన్‌ఓసీ వచ్చిందని తెలిపారు. ట్రాఫిక్‌ మళ్లింపులు, బారికేడింగ్‌ తర్వాత పనులు ప్రారంభిస్తామని తెలిపారు. స్కైవాక్‌ను వాసవి ఎవెన్యూస్‌ ఎల్‌ఎల్‌పీ, ఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రా అండ్‌ డెవలపర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయని తెలిపారు. ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోతో కుదిరిన ఒప్పందం ప్రకారం 6 నెలల్లో స్కైవాక్‌ను పూర్తి చేయాల్సి ఉంది. రూ.15 కోట్లతో చేపట్టే ఈ స్కైవాక్‌ను ఐఐటీ హైదరాబాద్‌ డిజైన్‌ చేసింది. సెంట్రల్‌ మీడియన్‌ నుంచి 14.5 మీటర్ల దూరంలో, జాతీయ రహదారి 65కి ఆనుకుని ఉన్న కాలిబాటల వరకు నిర్మిస్తారు. ఇందులో 10 ప్రధాన స్తంభాలు ఉంటాయి. ఒక్కో స్తంభం 5.94 మీటర్ల వ్యాసం, 8.64 మీటర్లతో ఎత్తుతో 12-14 మీటర్ల దూరంలో నిర్మిస్తారు. భవిష్యత్తులో సర్వీస్‌ రోడ్డు విస్తరణకు ఆటంకం కల్గకుండా డిజైన్‌ చేశారు. ప్రధాన స్కైవాక్‌ స్తంభం, అంతర్గత సరిహద్దు స్తంభం (దిగే మెట్లతో) మధ్యదూరం సుమారు 12.5 మీటర్లు ఉంటుంది. స్కైవాక్‌లో ర్యాంప్, లిఫ్ట్‌ సదుపాయంతోపాటు మెట్లు ఉంటాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





