

- సైఫాబాద్ పిఎస్‌లో తీవ్ర ఉద్రిక్తత
- కేటీఆర్ పీఏపై దాడి ఆరోపణలు
- వార్తలను తీవ్రంగా ఖండించిన పోలీసులు
Saifabad Police: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యక్తిగత పీఆర్వో, పీఏలపై సైఫాబాద్(Saifabad Police) పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే దాడి జరిగిందనే వార్తలు తీవ్ర కలకలం రేపాయి. శాంతిభద్రతల పరిరక్షణకు నిలయమైన పోలీస్ స్టేషన్లోనే ఈ విధమైన ఘటన చోటుచేసుకోవడం పట్ల బీఆర్ఎస్ అగ్రనేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
పోలీసుల వేషంలో దాడి.. హరీశ్‌రావు ఆగ్రహం:
ముసుగు ధరించిన పోలీసులే విచారణ గదిలోకి వెళ్లి మరీ కేటీఆర్ పీఆర్వో, పీఏలపై దాడికి తెగబడ్డారని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. బీఆర్ఎస్ లీగల్ టీమ్ సకాలంలో స్పందించి కేకలు వేయడంతో దాడి చేసిన వారు అక్కడి నుంచి పారిపోయారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోందని మండిపడ్డ కేటీఆర్, ఈ దుర్మార్గపు ఘటనపై వెంటనే సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆరోపణలను ఖండించిన సైఫాబాద్ పోలీసులు:
బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలను సైఫాబాద్ పోలీసులు తీవ్రంగా ఖండించారు. గణేశ్ మండపం వద్ద డీజే అనుమతుల కోసం వచ్చిన యువకులు, అసెంబ్లీ వద్ద న్యూసెన్స్ చేసిన కేసులో ఉన్నవారితో వాగ్వాదానికి దిగడంతో వారిని పోలీస్ స్టేషన్ నుంచి పంపించివేశామని వివరించారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరిగిందనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని, స్టేషన్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదని స్పష్టం చేశారు.





