
ఇంటర్నెట్‌ డెస్క్‌: యూపీఐ లావాదేవీలపై నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటును (MDR) విధించడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇందులో ఎలాంటి అంతర్జాతీయ ఒత్తిడులు లేవని.. తాము స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయమని ఆర్థిక శాఖ (Ministry of Finance) స్పష్టం చేసింది. ఆర్థికంగా నిలదొక్కుకోగలిగే.. అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను సృష్టించడమే ఈ కొత్త విధానం వెనుక ఉన్న లక్ష్యమని పేర్కొంది. స్వయం సమృద్ధి, సమ్మిళితమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అభివృద్ధి చేయడానికే ఈ ఆలోచన చేసినట్లు తెలిపింది. రూ.2వేల్లోపు లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలూ వర్తించబోవని, ఆపైబడిన నిర్దిష్ట లావాదేవీలకు మాత్రం 0.4 శాతం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఎన్‌పీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 15 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి రానున్నాయని వెల్లడించింది. అలాగే, వ్యక్తుల మధ్య జరిగే నగదు లావాదేవీలు (P2P), రూ.2000లోపు వ్యాపార చెల్లింపులు (P2M) ఎండీఆర్‌ పరిధిలోకి రావని స్పష్టంచేసింది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ( Rahul Gandhi ) వ్యతిరేకించారు. ‘భారత్‌లోని జీరో ఎండీఆర్‌ పాలసీని అమెరికా పేమెంట్‌ కంపెనీలు ఎప్పటినుంచో వ్యతిరేకిస్తున్నాయి. ఆ కంపెనీల ఆకాంక్షలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం ఈ మార్పు చేసింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో రాజీ పడిన ప్రధాని మోదీ.. మరోసారి అగ్ర రాజ్య ( USA ) ఒత్తిడికి లొంగిపోతున్నారు. ఎండీఆర్‌తో వ్యాపారులపై పడే అదనపు భారం చివరికి పెరిగిన ధరల రూపంలో సగటు వినియోగదారుడిపైనే పడుతుంది’ అని విమర్శించారు. ఇదీ చదవండి: ఫోన్‌ కొంటే.. రెస్టారంట్‌లో తింటే.. యూపీఐ ఛార్జీలు చెల్లించాలా..? .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





