
ఈనాడు, చెన్నై: చెన్నై ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డులో సినీనటి శ్రీదేవి కొనుగోలు చేసిన 4.77 ఎకరాల స్థలంపై సుప్రీంకోర్టు బుధవారం స్టేటస్‌ కో విధించింది. శ్రీదేవి మరణానంతరం ఆమె కుటుంబానికి, ఆ ఆస్తిని అమ్మిన కుటుంబానికి మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 1988లో ఆ స్థలం విక్రయానికి సంబంధించిన పత్రాల్ని రద్దుచేయాలని శివగామి, ఆమె సోదరుడు నటరాజన్‌ స్థానిక చెంగల్పట్టు అదనపు జిల్లా జడ్జి కోర్టును ఆశ్రయించారు. తమకు తెలియకుండా తమ కుటుంబీకులు శ్రీదేవికి ఆస్తిని విక్రయించినట్లు కోర్టుకు విన్నవించారు. గత ఏడాది ఆ కోర్టు శ్రీదేవి భర్త బోనీకపూర్‌కు నోటీసులు జారీచేసింది. దీనిపై ఆయన మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ట్రయల్‌కోర్టు ఉత్తర్వుల్ని రద్దుచేస్తూ మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలను సవాలు చేస్తూ శివగామి, నటరాజన్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం వాదనలు జరిగాయి. తదుపరి విచారణను డిసెంబరు 18కి వాయిదా వేస్తూ.. అప్పటిదాకా ఆస్తిపై స్టేటస్‌కో విధించింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




