
ఈనాడు, హైదరాబాద్‌: మత్తు పదార్థాల విక్రయాలతో ఆస్తులు కూడబెట్టిన నిందితులపై తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌(ఎలైట్‌ యాక్షన్‌ గ్రూప్‌ ఫర్‌ డ్రగ్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌) కొరడా ఝుళిపించింది. 2025లో నమోదైన కేసులోని నలుగురు నిందితులకు చెందిన రూ.3.52 కోట్ల విలువైన స్థిర, చరాస్తుల్ని జప్తు చేసింది. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.6.55 కోట్లు ఉంటుందని తెలంగాణ ఈగల్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. నగర శివారు ఉప్పర్‌పల్లిలో 2025 ఏప్రిల్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తుండగా తెలంగాణ ఈగల్‌ బృందం దాడి చేసి నైజీరియాకు చెందిన ఉగ్వు ఇకెచుక్వు ఎలియాస్‌ ఎమ్మా, మహ్మద్‌ మతీన్‌ సిద్ధిఖీ, సయ్యద్‌ అబ్దుల్‌ అజీజ్‌ సోహైల్, నజీర్‌ అహ్మద్, సయ్యద్‌ యూసుఫ్‌ హక్, శాంతిలాల్‌ కుమార్‌ జైన్, ఉత్తమ్‌ జైన్‌ తదితరుల్ని అరెస్టు చేసింది. నిందితుల నుంచి 16.50 గ్రాముల కొకైన్, 52.29 గ్రాముల ఎండీఎంఏ, రూ.45 వేల నగదు స్వాధీనం చేసుకుంది. కేసు నమోదు చేసిన ఈగల్‌ ఫోర్స్‌... నిందితుల్లో నలుగురి వెనుక భారీ నెట్‌వర్క్‌ ఉన్నట్లు గుర్తించింది. ఈ కోణంలో ఆరా తీయగా నిందితులు రూ.3.52 కోట్ల స్థిర, చరాస్తులు కూడగట్టినట్లు గుర్తించింది. ఈ ఆధారాలను చెన్నైలోని సఫేమాకు పంపగా జప్తునకు అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌ ఈ ఆస్తుల్ని జప్తు చేసింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





