
పది వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగయ్యే ప్రతి జిల్లాలో కర్మాగారం: తుమ్మల ఈనాడు, హైదరాబాద్‌: వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేసుకుని ఈ సంవత్సరం సుమారు రూ.1,000 కోట్లతో ఉద్యాన పంటల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అదనంగా 2 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగులోకి తెస్తామన్నారు. బుధవారం శాసనసభలో వివిధ అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం 4 ఆయిల్‌పామ్‌ కర్మాగారాలు నడుస్తున్నాయి. మరో 6 కొత్తవి నిర్మాణమవుతున్నాయి. పది వేల ఎకరాల్లో ఈ పంట ఉంటేనే కర్మాగారం నడుస్తుంది. ఏ జిల్లాలో అయినా ఆ లక్ష్యం చేరితే ఆరు నెలల్లో పరిశ్రమ ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిది. ఈ ఏడాది 3.20 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నాం. ఆయిల్‌పామ్‌ అభివృద్ధికి రూ.261 కోట్లు... ఉద్యాన పంటల సాగు ప్రోత్సాహానికి రూ.150 కోట్లు... బిందు, తుంపర సేద్యం కోసం రూ.243 కోట్లు కేటాయించాం’’ అని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీవో, తహసిల్దార్‌ కార్యాలయాలు లేని చోట.. నూతన భవన నిర్మాణాలు చేపట్టామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ‘‘కొత్త కార్యాలయాల కోసం అన్ని జిల్లాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. కొన్నిచోట్ల పురాతన భవనాల్లో నడుస్తున్నాయి. నూతన భవనాల కోసం తొలి విడతలో రూ.600 కోట్లు మంజూరు చేశాం. ఆర్మూర్‌లో ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అసంపూర్తిగా ఉన్న ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ కార్యాలయాన్ని త్వరలో పూర్తిచేస్తాం. పోలీసుస్టేషన్లు, మండల పరిషత్‌ కార్యాలయాల నిర్మాణం కోసం ఆయా శాఖల మంత్రులకు నివేదిస్తాం’’ అని తెలిపారు. అంతకుముందు ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ... నిజామాబాద్‌ అంటేనే ఎవరికీ పట్టని జిల్లాగా మారిందని, నిధుల కోసం అవసరమైతే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్పారు. ‘‘నా నియోజకవర్గంలో నిజాం కాలంనాటి తహసీల్దార్, సబ్‌కలెక్టర్‌ కార్యాలయాలున్నాయి. రెండేళ్లుగా అధికారులతో పాటు సీఎం, రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకువెళుతున్నా పట్టించుకోవడంలేదు. మంథని, ములుగు, కొడంగల్, పరిగికి ఎన్ని నిధులు వెళ్తున్నాయి? నిజామాబాద్‌కు ఎన్ని నిధులు ఇచ్చారో చిట్టా తెచ్చా. లెక్కలు చెప్పి రాజీనామా చేస్తా’’ అని తెలిపారు. మైనారిటీ విద్యార్థుల కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో స్టడీ సర్కిల్, కెరీర్‌ గైడెన్స్‌ సెల్‌ ఉందని ఆ శాఖ మంత్రి మహ్మద్‌ అజారుద్దీన్‌ తెలిపారు. కొత్తగా ఆదిలాబాద్, కరీంనగర్, హనుమకొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్టడీ సర్కిల్‌ నిర్వహణకు 2026-27లో రూ.4 కోట్లు కేటాయించామని తెలిపారు. గత సమావేశాల్లో భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రవర్తనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించేందుకు ఎథిక్స్‌ కమిటీ గడువును వచ్చే సమావేశాల వరకూ పొడిగించాలనే తీర్మానానికి శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





