
కేటీఆర్‌ పీఏ, పీఆర్వోల పిటిషన్‌పై హైకోర్టు ఈనాడు, హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కార్యకర్తలను రెచ్చగొట్టారన్న కేసులో కేటీఆర్‌ పీఆర్‌ఓ, మీడియా కోఆర్డినేటర్‌ మహేశ్‌ మాణిక్య, వ్యక్తిగత సహాయకుడు మహేందర్‌రెడ్డిని స్టేషన్‌లో విచారించినప్పటి సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలంటూ సైఫాబాద్‌ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ సమయంలో వారికి తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలంది. తమపై నమోదైన కేసులో ఈనెల 14న సాయంత్రం విచారణకు వెళ్లగా అక్కడ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారని, రక్షణ కల్పించాలని కోరుతూ మహేశ్, మహేందర్‌రెడ్డిలు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ టి.మాధవీదేవి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది టి.వి.రమణరావు వాదనలు వినిపిస్తూ ఇరువురిని పోలీసులు విచారిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు స్టేషన్‌లోకి వచ్చి దాడికి ప్రయత్నించారన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. దీనిపై అధికారిక విచారణ జరపాలని కోరారు. హోంశాఖ జీపీ మహేశ్‌రాజె వాదనలు వినిపిస్తూ గణేశ్‌ ఉత్సవాల నేపథ్యంలో స్టేషన్‌కు కొందరు డీజే ఏర్పాటుకు అనుమతి కోసం వచ్చారన్నారు. పిటిషనర్ల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఈ ఆరోపణలపై కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే వెళ్లే దారిలోనూ, స్టేషన్‌లో ఉన్న సీసీటీవీని భద్రపరచాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





