
ఈనాడు, హైదరాబాద్‌: రాజధాని హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు, భూదాన్, ఎసైన్డ్‌ భూముల వివరాలను బయటికి తీయాలని సీపీఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. అధికారులు, నేతల అండతో భూకబ్జాదారులు, పైరవీకారులు, భూమాఫియా పెరిగిందని, ఇటీవల ఏసీబీ దాడుల్లో 25 మంది వద్ద రూ.4,500 కోట్లు దొరకడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. రాష్ట్రంలో 22ఏ విషయంలో జరిగింది సాంకేతిక తప్పిదంగా భావిస్తున్నట్లు తెలిపారు. దీనిలో మంత్రులు, అధికారుల పాత్ర ఎంత ఉందో తేల్చాలన్నారు. బుధవారం శాసనసభలో ఆయన 22ఏ అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో మాట్లాడారు. ‘‘చంద్రబాబు హయాంలో 1999లోనే 22ఏ తెచ్చారు. కోర్టు జోక్యంతో అది ఆగిపోయింది. 2020లో ధరణి వచ్చిందని, దాంతో కేసీఆర్‌తోపాటు ప్రజలకు చాలా నష్టం జరిగింది. భారాస దానివల్లే ఓడిపోయింది. కాగితాల్లో ఎసైన్డ్, అటవీ భూములుగానే ఉన్నా లోలోపల కొనుగోళ్లు జరిగాయి. కొంతమంది పెద్దలు ఎస్సారెస్పీ, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల కింద రైతులను బలవంతంగా వెళ్లగొట్టారు. అలా లాక్కున్న భూములు ఎక్కడ ఉన్నాయో తెలియాలి. ఎసైన్డ్‌ భూములు ఎన్ని చేతులు మారాయో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయాలి’’ అని కూనంనేని సూచించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





