
జర్మనీలో ఇటీవల జరిగిన సక్సోనీ-యాన్‌హాల్ట్‌ రాష్ట్ర ఎన్నికల్లో అతిమితవాద ఆల్టర్నేటివ్‌ ఫర్‌ జర్మనీ(ఏఎఫ్‌డీ) పార్టీ 44శాతం ఓట్లు గెలుచుకోవడం ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తరవాత జర్మనీలో ఒక అతిమితవాద పక్షం ఇంత విజయం సాధించడం ఇదే ప్రథమం. ఇప్పటివరకు సామ్యవాద, సంక్షేమ సూత్రాలకు పట్టంకడుతూ వచ్చిన ఐరోపాలో మళ్లీ నాజీ, ఫాసిస్టు భావజాలం మొగ్గతొడుగుతోందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐ రోపాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కొవిడ్‌ వల్ల సరఫరా గొలుసులు విచ్ఛిన్నం కావడం, అమెరికా-చైనా ఆర్థిక వైరం పెరుగుతుండటం, డొనాల్డ్‌ ట్రంప్‌ తమ పర భేదం లేకుండా చిరకాల యూరోపియన్‌ మిత్రదేశాల పైనా ఆంక్షల అస్త్రం ఝళిపించడం వంటివి ఆ ఖండంలో ఆర్థికంగా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు, ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా ఐరోపా దేశాలకు ట్రంప్‌ పూర్తి అండదండలు ఇవ్వకపోవడం, రక్షణ బడ్జెట్‌ను పెంచుకోండంటూ దబాయించడం, ఐరోపాలోని అతిమితవాద పక్షాలవైపు అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు మొగ్గు చూపడం రాజకీయంగా చిక్కు పరిస్థితిని సృష్టిస్తోంది. మారిన ప్రపంచ ఆర్థిక వాతావరణంతో ఐరోపా దేశాల్లో జీవన వ్యయంతో పాటు ప్రభుత్వాలపై రుణభారమూ గణనీయంగా పెరుగుతోంది. ఇలాంటి తరుణంలోనే ఐరోపా దేశాలకు వలసలు పోటెత్తుతుండటం అక్కడి ప్రజల్లో నిరసనాగ్రహాలను రేపుతోంది. వలసదారుల వల్ల తమకు ఎంట్రీ స్థాయి ఉద్యోగాలు దొరక్కుండా పోతున్నాయనీ, నిరుద్యోగం పెరుగుతోందనీ ఐరోపా యువత భావిస్తోంది. వచ్చే ఏడాది ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, పోలాండ్, గ్రీస్, ఫిన్లాండ్, ఎస్టోనియా, స్లొవేకియా, స్లొవేనియా దేశాల్లో కీలకమైన పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి తోడు జర్మనీలో ఫెడరల్‌ అధ్యక్ష పదవికి పరోక్ష ఎన్నికను నిర్వహిస్తారు. ఇలాంటి కీలక సమయంలో అక్కడి సక్సోనీ-యాన్‌హాల్ట్‌ రాష్ట్రంలో ఏఎఫ్‌డీ విజయం సాధించడాన్ని ఐరోపా మొత్తానికి ఒక హెచ్చరికగా విశ్లేషిస్తున్నారు. ఫ్రాన్స్‌లో అతిమితవాద నాయకురాలు మరీన్‌ లే పెన్‌ ఇప్పటికే ముందంజలో ఉన్నట్లు ప్రజాభిప్రాయ సేకరణలు సూచిస్తున్నాయి. ఇంతకాలం ఐరోపా దేశాల్లో అతిమితవాద పార్టీలకు జనాదరణ అంతంత మాత్రంగానే ఉండేది. ఇవి ఎప్పుడైనా కాస్త చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓట్లు, సీట్లు సాధించినా కన్సర్వేటివ్‌(మితవాద) పార్టీలు, వామపక్ష, సోషలిస్టు పక్షాలు పరస్పరం చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వచ్చాయి. అలా అతిమితవాదులను అవి అధికారానికి దూరంగా ఉంచుతున్నాయి. కానీ, ఈసారి జర్మనీలో రాష్ట్రస్థాయిలో ఏఎఫ్‌డీ సొంతంగా 44శాతం ఓట్లు సాధించడంతో వచ్చే ఏడాది ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో అతిమితవాదులు సొంతంగా, సాధారణ మెజారిటీనైనా సాధిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అతిమితవాదులకు మెజారిటీ రాకపోయినా ఐరోపా పార్లమెంట్లలో వారి బలం పెరిగితే వలసలు, జాతీయ భద్రత, వాతావరణ మార్పుల నిరోధంపై ఆయా దేశాలు సమష్టి సహకారం సాధించడం కష్టమవుతుంది. ఏఎఫ్‌డీ మాదిరిగానే హంగరీకి చెందిన ఫిడెజ్‌ వంటి అతిమితవాద పార్టీలు ఉక్రెయిన్‌కు ఐరోపా దేశాల ఆర్థిక సాయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ యుద్ధం వల్లే జర్మనీకి చవకైన రష్యన్‌ చమురు, గ్యాస్‌ల ఎగుమతి నిలిచిపోయి ద్రవ్యోల్బణం పెరిగిందని ఏఎఫ్‌డీ విమర్శిస్తోంది. ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని నిలిపేయాలనీ, రష్యన్‌ ఇంధన దిగుమతులను పునరుద్ధరించాలనీ ఏఎఫ్‌డీ సక్సోనీ-యాన్‌హాల్ట్‌ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. ఇక ఫ్రాన్స్‌లో ప్రాబల్యం పెంచుకుంటున్న అతిమితవాది మరీన్‌ లే పెన్‌కు రష్యాతో ఆర్థిక, రాజకీయ సంబంధాలు ఉన్నాయి. లే పెన్‌ పార్టీ అయిన నేషనల్‌ ర్యాలీ రష్యాతో సంబంధం ఉన్న బ్యాంకుల నుంచి గతంలో పెద్దమొత్తంలో రుణాలు పొందింది. లే పెన్‌ ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను వ్యతిరేకిస్తున్నా, ‘యుద్ధం ముగిశాక ఈయూ-రష్యా మధ్య సయోధ్య’ను వాంఛిస్తున్నారు. అలాగని ఐరోపా దేశాల్లోని అతిమితవాద పార్టీలన్నీ రష్యాకు అనుకూలం కాదు. ఏఎఫ్‌డీ, నేషనల్‌ ర్యాలీ వంటి అతిమితవాద పార్టీలకు పార్లమెంటులో మెజారిటీ దక్కకుండా చూడటానికి మితవాద-మధ్యేవాద, వామపక్ష-మధ్యేవాద పార్టీలు, వాటి ప్రభుత్వాలు వేగంగా అడుగులు వేయనారంభించాయి. ఏఎఫ్‌డీ, నేషనల్‌ ర్యాలీ వంటి పార్టీల నినాదాలు, విధానాల్లోని కొన్ని అంశాలను స్వీకరించడం ద్వారా వాటిపై జనాకర్షణను తగ్గించేందుకు అవి ప్రయత్నిస్తున్నాయి. సరిహద్దులను కట్టుదిట్టం చేస్తూ వలసలను నిరోధిస్తున్నాయి. ఆశ్రయం కోరిన వలసదారులను వేగంగా తిప్పిపంపే ప్రక్రియనూ చేపడుతున్నాయి. వలసలతోపాటు ద్రవ్యోల్బణం, అధిక ఇంధన ధరలు వంటి అంశాలు ఓటర్లను అతిమితవాదులవైపు ఆకర్షిస్తున్నాయని గ్రహించి, హరిత ఇంధనాలకు మారే ప్రక్రియను ఆలస్యం చేస్తున్నాయి. ఏతావాతా 2027లో జరిగే ఎన్నికలు, ఫలితాలు ఐరోపాపై రాజకీయంగా, ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనున్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




