
ఇంటర్నెట్‌ డెస్క్‌: జెన్‌జీ (gen z), జెన్‌ ఆల్ఫా (Gen Alpha) తరాలకు చెందిన యువత కూడా నాయకత్వ బాధ్యతలు స్వీకరించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ( Nirmala Sitharaman ) పిలుపునిచ్చారు. యువత ఆశయాలను వినడానికి దేశం సిద్ధంగా ఉందని.. వారు ముందుకు రావాలని కోరారు. దేశం మనకు ఏం చేసిందని అనుకోకుండా.. దేశం కోసం మనమేం చేశామో ప్రశ్నించుకోవాలని సూచించారు. తమిళనాడు (Tamil Nadu)లోని డాక్టర్ ఎం.జి.ఆర్. ఎడ్యుకేషనల్ అండ్‌ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మిమ్మల్ని మీరు జెన్‌జీ, జెన్‌ ఆల్ఫా అని పిలుచుకున్నా సరే.. మీరు చెప్పేది వినడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. కానీ మీ చుట్టూ ఏం జరుగుతోంది? అందులో మీ పాత్ర ఏమిటి?, మీరు దేశం కోసం ఏం సాధించవచ్చు? అనే విషయాల గురించి తప్పక ఆలోచించాలి. దేశ ప్రయోజనాల విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదు. దేశం సురక్షితంగా, బలంగా ఉంటేనే మనం నివసించడానికి ఒక ఇల్లు ఉంటుంది. పలు ప్రపంచ దేశాల్లో యుద్ధాలు, ఘర్షణల కారణంగా పౌరులు నిర్వాసితులుగా మారుతున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. కానీ మనకు ఆ పరిస్థితి లేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine war), పశ్చిమాసియాలో ఘర్షణలు వంటి అనిశ్చితుల వల్ల ప్రపంచ దేశాల్లో ముడి చమురు, గ్యాస్, ఎరువుల సరఫరాపై ప్రభావం పడుతోంది. అయినప్పటికీ భారత్‌ అన్ని పరిస్థితులను ఎదుర్కొని.. 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని బలమైన ప్రభుత్వమే ఈ స్థిరత్వానికి కారణం. యువత కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పిస్తోంది. జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా.. ధైర్యంగా ముందుకు సాగాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం’ అని నిర్మలా సీతారామన్‌ విద్యార్థులకు సూచించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





