
కుభీర్: పర్యావరణ పరిరక్షణకు ( Environmental protection ) నిర్మల్ జిల్లా కుభీర్ ( Khubeer) మండలంలోని మాలేగాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించేలా వినూత్న కార్యక్రమం చేపట్టారు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు శేషోళ్ల మహేష్ ( Teacher Mahesh ) పలువురు విద్యార్థులచే మట్టి గణనాథుల విగ్రహాలను ( Ganesha Idols ) తయారు చేయించి, వాటిని గ్రామ ప్రజలకు పంపిణీ చేయించారు. వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణానికి మేలు చేకూరుతుందని, రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారయ్యే విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని విద్యార్థులకు వివరించారు. ప్రకృతి పరిరక్షణ, నీటి కాలుష్య నివారణ వంటి అంశాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు స్వయంగా మట్టి గణనాథులను తయారు చేయడం ద్వారా సృజనాత్మకతతో పాటు పర్యావరణంపై బాధ్యతాయుతమైన ఆలోచనా విధానం పెంపొందుతుందని తెలిపారు. విద్యార్థులు తయారు చేసిన మట్టి గణనాథులను గ్రామ ప్రజలకు పంపిణీ చేయడంతో పలువురు అభినందించారు.




