
మానవ శరీరంలో లివర్ అత్యంత కీలకమైన అంతర్గత అవయవం. మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేయడంతో పాటు, రక్తంలోని హానికర రసాయనాలను, వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపే సహజ ఫిల్టర్‌గా ఇది పనిచేస్తుంది. ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్, ఆల్కహాల్, ఒత్తిడి వల్ల కాలేయంపై అదనపు భారం పడుతోంది. దీంతో లివర్ డీటాక్స్ పేరిట ఖరీదైన సప్లిమెంట్లు, మార్కెట్లో దొరికే కృత్రిమ జ్యూస్‌ల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఖరీదైన సప్లిమెంట్ల అవసరం లేకుండానే మన వంటగదిలోని సహజ పదార్థాలతో కాలేయాన్ని సులభంగా, సురక్షితంగా శుభ్రం చేసుకోవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.





