
కాగితాల్లోనే భూములు.. లీజు భవనాల్లోనే డిగ్రీ కళాశాలలు అధికార యంత్రాంగం ఉదాసీనతతో విద్యార్థులకు ఇబ్బందులు ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యం కళాశాల సొసైటీ పేరిట రింగ్‌రోడ్డు సమీపంలో ఎకరం స్థలం చూపింది. ఐదేళ్ల తర్వాత సొంత స్థలంలో భవనం నిర్మించి అందులోకి తరలిపోవాలన్నది విద్యాశాఖ నిబంధన. అయితే ఆ కళాశాల దశాబ్దాలుగా లీజు భవనంలోనే నడుస్తోంది. ఇటీవల ఆ కళాశాలను వేరే వ్యక్తులు కొనుగోలు చేయగా సొసైటీ పేరిట ఉన్న స్థలం ఎన్నో ఏళ్ల క్రితమే అమ్ముకున్నట్లు తేలింది. కేవలం ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో పదుల సంఖ్యలోని కళాశాలల యాజమాన్యాలు సొసైటీ పేరిట చూపిన స్థలాలను అమ్మేసుకున్నాయి. మరికొందరు తమ కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. అటు రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఇటు వర్సిటీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో అధిక శాతం ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు 2012 నుంచి నిషేధం ఉన్నా.. గతంలో ప్రారంభ సమయంలో ఐదేళ్లు మాత్రమే అద్దె/లీజు భవనాల్లో నడుపుకొనేందుకు వీలుంది. ఆ లోపు సొంత భవనాలు నిర్మించుకుంటామని అందుకు పట్టణ/నగర ప్రాంతాల్లో ఎకరం విస్తీర్ణం, గ్రామీణ ప్రాంతాల్లో రెండు ఎకరాల విస్తీర్ణమున్న స్థలాలను కళాశాల సొసైటీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాలి. విచిత్రమేంటంటే.. దశాబ్దాలు గడుస్తున్నా కళాశాలలు సొంత భవనాల్లోకి తరలిపోలేదు. ఓయూ పరిధిలో 450 ప్రైవేటు డిగ్రీ కళాశాలలున్నాయి. వాటిలో 90 శాతం లీజు భవనాల్లోనే నడుస్తున్నాయి. కనీసం 50 నుంచి 100 కళాశాలల యాజమాన్యాలు నాన్‌ ప్రాఫిట్‌ సొసైటీ పేరిట ఉన్న స్థలాలను విక్రయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి వర్సిటీలు కళాశాలలను తనిఖీ చేస్తున్నాయి. ఆ సందర్భంగా మౌలిక వసతులతోపాటు భవనం లీజు పత్రాలు, సొసైటీ పేరిట కేటాయించిన స్థలాలు ఉన్నాయో? లేవో? పరిశీలించాలి. అయితే స్థలాలను విక్రయించినప్పుడు ఒరిజనల్‌ లింకు డాక్యుమెంట్లను తనిఖీల సమయంలో తమకు ఒక రోజు ఇవ్వాలని ముందుగానే కొనుగోలుదారుతో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. దాంతో తనిఖీల సందర్భంగా దాన్ని చూపుతున్నారు. ఈ విషయం కొందరు ఆచార్యులకు తెలిసినా.. కళాశాలలు ముట్టజెప్పే మామూళ్లు తీసుకొని మిన్నకుండి పోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అద్దె భవనాల కారణంగా విశాలమైన తరగతి గదులు, ఇతర వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. - ఆచార్య ఎం.కుమార్, వైస్‌ ఛాన్సలర్, ఓయూ కొన్ని కళాశాలలు సొసైటీ పేరిట ఉన్న స్థలాలను విక్రయించుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. అందుకే ఒరిజనల్‌ ధ్రువపత్రాలతో పాటు స్థలాలను విక్రయించినా ప్రస్తుతం అవి ఎవరి పేరిట ఉన్నాయో తెలుసుకునేందుకు ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్లు(ఈసీ)ని కూడా సమర్పించాలని ఆదేశించాం. వాటిని పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కళాశాలలపై చర్యలు తీసుకుంటాం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




