
Cm Chandrababu Naidu Grief Vijayawada Traffic Dcp Daughter Road Accident Suchi 1548782
రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఎండీ అఫిఫా మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు.
రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఎండీ అఫిఫా మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు.
అమరావతి, ఆగస్టు 10: రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఎండీ అఫిఫా మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఎంతో భవిష్యత్తు ఉన్న అఫిఫా.. 24 ఏళ్ల చిన్న వయస్సులో రోడ్డు ప్రమాదం బారిన పడి అందరికీ దూరమవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండీ అఫిఫా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. షరీన్ బేగం, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.
అఫిఫా మృతి తీవ్రంగా కలిచివేసింది: హోం మంత్రి అనిత
విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె అఫిఫా రోడ్డు ప్రమాదంలో మృతిపై హోం మంత్రి వంగలపూడి అనిత విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్నా.. 24 ఏళ్ల వయసులోనే నిండు జీవితాన్ని కోల్పోవడం బాధాకరమన్నారు. అఫిఫా మృతి తీవ్రంగా కలచివేసిందని ఆవేదన చెందారు. విషాద సమయంలో అఫిఫా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుకున్నారు. అఫిఫా ఆత్మకు శాంతి చేకూరాలని హోం మంత్రి అనిత ప్రార్థించారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె అఫిఫా భౌతికకాయానికి ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా నివాళులర్పించారు. అజిత్ సింగ్ నగర్‌కు చేరుకున్న డీజీపీ, సీపీ.. అఫిఫాకు నివాళులర్పించి, షరీన్ బేగంను ఓదార్చి ధైర్యం చెప్పారు.
నిన్న(ఆదివారం) స్నేహితులతో కలిసి సరదాగా గడుపుదామని కారులో చీరాల బీచ్‌కు బయలుదేరిన అఫిఫా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీ సడెన్ బ్రేక్ వేయడంతో వెనకాల నుంచి వచ్చిన కారు దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అఫిఫా అక్కడికక్కడే మృతిచెందగా, కారులో ప్రయాణికులు నలుగురు గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్త స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






