
పోలవరం జిల్లా, ఏటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో క్లోరోక్విన్ మాత్రలు వేసుకున్న అనంతరం ఏడేళ్ల బాలిక మృతి చెందడం, పలువురు అస్వస్థతకు గురికావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. బాధితులందరికీ అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆయన స్పష్టం చేశారు.ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్తో ముఖ్యమంత్రి ఈ ఘటనపై సమీక్ష నిర్వహించారు. మలేరియా రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలోని 71 మందికి క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేయగా, వాటిని తీసుకున్న తర్వాత పలువురు అనారోగ్యం పాలయ్యారు. ఈ దురదృష్టకర ఘటనలో జమున అనే ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం తక్షణమే సహాయక చర్యలు చేపట్టింది. అస్వస్థతకు గురైన వారిలో 29 మందిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి, మరో 24 మందిని లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో అత్యవసర వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక వైద్య బృందం ఇప్పటికే గ్రామానికి చేరుకోగా, విజయవాడ, రాజమండ్రి నుంచి మరిన్ని బృందాలు బయలుదేరాయి.ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, కేవలం ఒక బాలిక మాత్రమే మృతి చెందిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని వారు వెల్లడించారు.





