
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Plastic Currency Notes in India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతిపాదించిన ₹10, ₹20 నోట్లలో పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను క్షేత్రస్థాయి పరిశీలన (Field Trials) కోసం ప్రవేశపెట్టే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని మంగళవారం రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు. ఒక్కో విభాగంలో వంద కోట్ల పాలిమర్ నోట్లను ఫీల్డ్ ట్రయల్స్‌కు పంపించనున్నారు. కేంద్ర ఆమోద ముద్ర వేసినంత మాత్రన తక్షణమే దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావడం లేదు. క్షేత్రస్థాయి ప్రయోగాలు విజయవంతమైతే.. ఇప్పటికే ఉన్న కాగితపు కరెన్సీతో పాటు పాలిమర్ ₹10, ₹20 నోట్లను ప్రవేశపెట్టనున్నారు. ఆర్బీఐ చట్టం, 1934లోని సెక్షన్ 25 ప్రకారం ఆర్బీఐ సెంట్రల్ బోర్డు ప్లాస్టిక్ నోట్ల ప్రణాళికను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ప్రయోగాత్మక పరిశీలనలు సక్సెస్ అయితే.. సాధారణ చెలామణిలోనూ ఈ నోట్లను కొనసాగించాలని ఆర్బీఐ భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లను తక్షణమే పూర్తిగా ఉపసంహరించుకోకుండా.. కొత్త పాలిమర్ నోట్లను కూడా వాటితో పాటు సమాంతరంగానే చెలామణిలోకి తీసుకువస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతానికి ఈ నోట్ల కొనుగోలు, తయారీ ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని.. అందువల్ల ఇవి కచ్చితంగా ఏ తేదీ నుంచి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయి..? లేదా ఈ ప్రాజెక్ట్‌కు ఎంత ఖర్చు అవుతుందనే వివరాలను ఇప్పుడే ఖరారు చేయలేమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఇదే సందర్భంలో ఆర్థిక మంత్రి దేశ ద్రవ్యోల్బణం పరిస్థితిపై కూడా వివరణ ఇచ్చారు. గడచిన కొన్ని సంవత్సరాలుగా రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా.. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా పెరిగిన ఇంధన, కమోడిటీ ధరలు, రుతుపవనాల ప్రభావంతో కూరగాయల ధరలు పెరిగి ఇటీవలి త్రైమాసికంలో స్వల్పంగా పెరిగిందన్నారు. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 2023-24లో 5.4 శాతం నుంచి 2024-25లో 4.6 శాతానికి, ఆపై 2025-26లో 2.1 శాతానికి తగ్గిందని చెప్పారు. అయితే 2026-27 మొదటి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం పెరిగి 3.9 శాతానికి చేరుకుందన్నారు. త్రైమాసిక పెరుగుదల ఉన్నా.. ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశించిన 4 శాతం లక్ష్యం కంటే తక్కువగానే ఉందని అన్నారు.
జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు, పన్ను రేట్ల హేతుబద్ధీకరణ ద్వారా పలు నిత్యావసర ఉత్పత్తులు, సేవలపై పన్ను భారం తగ్గి వినియోగదారులకు ఉపశమనం కలిగిందని కేంద్ర మంత్రి సభకు వివరించారు. ఖర్చులను తగ్గించి.. వినియోగానికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పరోక్ష పన్నుల విధానంలో మార్పులు, ఇతర ఆర్థిక చర్యలను కూడా ప్రస్తావించారు.




