
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం ఆసియా ఖండాన్ని ఉర్రూతలూగించే క్రీడా సంబురానికి రంగం సిద్ధమవుతోంది. జపాన్‌లోని ఐచి నగోయా వేదికగా మరో రెండు రోజుల్లో మొదలయ్యే ఆసియా గేమ్స్‌లో 45 దేశాల నుంచి పది వేలకు పైగా అథ్లెట్లు పోటీ పడనున్నారు. వారి కోసం 43 క్రీడలు ఎదురుచూస్తుండగా.. ఈసారి కొత్తగా ఆరు ఆటలను చేర్చారు. అందులో ఓ ఆట.. క్రీడాకారులకు సవాల్‌గా, అభిమానులకు కన్నుల పండుగగా.. ఆసియాడ్కే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 12 ఏండ్ల క్రితమే యూరప్‌లో పురుడుపోసుకుని, తర్వాత క్రమంగా ఖండంతరాలు దాటుతూ ఆసియా గేమ్స్‌లో అరంగేట్రం చేయనున్న ఆ ఆటే ‘టెక్బాల్’. టేబుల్ టెన్నిస్, వాలీబాల్, ఫుట్‌బాల్ పోలికలు ఉండే ఈ ఆట మెగా గేమ్స్‌లో సర్ప్రైజ్ ప్యాకేజీ. టేబుల్ టెన్నిస్‌ను పోలిన బల్లపై చిన్నపాటి వాలీబాల్ సైజు బంతిని చేతులతో టచ్ చేయకుండా ఇతర శరీర భాగాలతో ఆడే ఈ వెరైటీ గేమ్ ఫ్యాన్స్‌కు పైసా వసూల్ మజాను అందిస్తుందనడంలో సందేహమే లేదు. దిగ్గజ సాకర్ స్టార్లు మెస్సీ, నెయ్మార్, డేవిడ్ బెక్‌హమ్‌తో పాటు అమెరికా పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఈ ఆటకు అభిమానులే అంటే టెక్బాల్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత దశాబ్దకాలంగా విశేష ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ ఆట పుట్టింది హంగేరీలో. సాకర్ వీరాభిమానులైన ముగ్గురు వ్యక్తులు ఈ గేమ్ సృష్టికర్తలు. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన గాబర్ బొర్సాన్యి, బిజినెస్మెన్ గ్యొర్గి గట్యాన్, కంప్యూటర్ సైంటిస్ట్ విక్టర్ హుజర్ 2012లో దీనికి రూపకల్పన చేశారు. ప్రస్తుతం 120కి పైగా దేశాల్లో ఈ గేమ్‌ను ఆడేందుకు ఔత్సాహికులు ఉత్సాహం చూపిస్తున్నారు. 2018లో భారత్‌లోకి వచ్చిన ఈ ఆటలో ఇప్పుడు ఆసియా క్రీడల్లోనూ ప్రాతినిథ్యం వహించనుండటం గమనార్హం. టీటీ టేబుల్‌ను పోలి రెండు వైపులా వంగినట్టు ఉండే బల్ల (0.9 మీటర్ల పొడవు, 3 మీటర్ల దూరం, 1.5 మీటర్ల వెడల్పు) పై ఈ ఆటను ఆడతారు. 16X12 మీటర్లు ఉండే కోర్టులో టేబుల్‌కు రెండు మీటర్ల దూరంలో ఉండే సర్వీస్ లైన్ నుంచి ‘టెకర్స్’ (టెక్బాల్ ఆడే ప్లేయర్లు) బంతిని సర్వీస్ చేయాల్సి ఉంటుంది. నెట్‌కు బదులుటేబుల్ మధ్యలో ఒక ప్లాస్టిక్ గాజుముక్కతో కూడిన షీటు ఉంటుంది. బంతిని సర్వ్ చేసేప్పుడు ఆ షీట్‌కు తాకితే ఫౌల్‌గా పరిగణిస్తారు. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ ఫార్మాట్స్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఆసియా గేమ్స్ టెక్బాల్లో భారత్ నుంచి ముగ్గురు టెకర్స్ బరిలో నిలిచారు. వేర్వేరు రంగాల నుంచి వచ్చిన ఈ త్రయానిది భిన్నమైన నేపథ్యం. వారిలో ఒకరు క్విమ్సీ డిసౌజా. ఈమె బెంగళూరులో టెస్ట్ ఇంజినీర్. మరొకరు అనాస్ బేగ్. ఇతడు డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. మూడో ప్లేయర్ డెక్లాన్ గొంజాల్వెస్ ఓ కంటెంట్ క్రియేటర్. ఈ ముగ్గురూ ముంబైకి చెందినవారే. ఫుట్‌బాల్ అంటే అమితాసక్తి ఉన్నా దాన్ని పోలి ఉన్న ఈ ఆటపై మక్కువ పెంచుకుని పార్ట్ టైమ్ ప్రొఫెషనల్స్‌గా టెక్బాల్ కెరీర్ మొదలుపెట్టారు. కానీ ఆటలో అనూహ్యంగా ఎదిగి ఇప్పుడు ఆసియాడ్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించనున్నారు. 2024లో జరిగిన టెక్బాల్ వరల్డ్ చాంపియన్స్‌లో అనాస్- గొంజాల్వెస్ ద్వయం కాంస్యం గెలిచింది. ఈ క్రీడలో దేశానికి అదే తొలి అంతర్జాతీయ పతకం. అనాస్- గొంజాల్వెస్ మెన్స్ డబుల్స్‌లో పోటీపడనుండగా డిసౌజాతో కలిసి అనాస్ మిక్స్డ్ డబుల్స్ ఆడనున్నాడు. మహిళల సింగిల్స్‌లో డిసౌజా బరిలో ఉంది.





