
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. గురువారం (ఆగస్టు 20) తమిళనాడులో నిర్వహిస్తున్న ' సదరన్ జోనల్ కౌన్సిల్ ' సమావేశం దీనికి వేదిక కానుంది. తొలిసారి ఏపీ, తమిళనాడు సీఎంలు ఒకే వేదికపై కనిపించనుండటం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశం చెన్నైలో నిర్వహిస్తుండటంతో తమిళనాడు సీఎం విజయ్ కచ్చితంగా హాజరవుతారని తెలుస్తోంది. ఆగస్టు 20న తమిళనాడులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ , కర్ణాటక ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, అంతర్రాష్ట్ర మండలి సచివాలయ కార్యదర్శి, రాష్ట్ర, కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో.. రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, అంతర్రాష్ట్ర వివాదాలు సహా పలు కీల అంశాలపై చర్చించనున్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ తమిళనాడు వెళతారు. సాయంత్రం 5:30 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకుంటారు.. రాత్రికి చెన్నైలోని తాజ్ ఫిషర్మ్యాన్స్ కోవ్ రిసార్ట్లో బస చేస్తారు. గురువారం (ఆగస్టు 20) ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు 31వ 'సదరన్ జోనల్ కౌన్సిల్' సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఆగస్టు 20వ తేదీ సాయంత్రం చెన్నై నుంచి బయల్దేరి విజయవాడ ఎయర్పోర్ట్కు చేరుకుంటారు.. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లి నివాసానికి వెళతారు.30వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం తిరువనంతపురంలో జరిగింది.. అక్కడ మొత్తం 26 అంశాలపై చర్చించగా.. తొమ్మిది అంశాలకు పరిష్కారం లభించగా.. మరో 17 అంశాలను తదుపరి పరిశీలన కోసం రిజర్వ్ చేశారు. ఈ 17 అంశాల్లో 9 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించినవి ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ సమస్యల్ని పరిష్కరించుకోవాలని కేంద్రం సూచించింది. ప్రధానంగా నీటి పంపిణీకి సంబంధించిన సమస్యలకు ఉమ్మడి పరిష్కారంపై సూచనలు చేశారు. రాష్ట్రాల మధ్య అంతర్-రాష్ట్ర సహకారం, మరియు సమన్వయం కోసం జోనల్ కౌన్సిళ్లు ఏర్పాటు చేశారు. ఈ జోనల్ కౌన్సిళ్లు ఆర్థిక, సామాజిక ప్రణాళిక, సరిహద్దు వివాదాలు, భాషా మైనారిటీలు, అంతర్రాష్ట్ర రవాణా వంటి రంగాలలో అంశాలపై చర్చించి, సిఫార్సులు చేయనున్నాయి. మొత్తం మీద ఏపీ సీఎం, తమిళనాడు సీఎంతో పాటుగా పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.





