
ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి ప్రస్థానం, చారిత్రక నేపథ్యం, ఘనమైన వారసత్వం, భూసమీకరణ విధానం, ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతి, భవిష్యత్‌ విజన్‌ గురించి సందర్శకులకు వివరించేందుకు రాజధానిలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి ప్రైవేటు సంస్థల నుంచి బిడ్‌లు పిలుస్తూ సీఆర్‌డీఏ ప్రకటన జారీ చేసింది. రాజధానికి వచ్చే పెట్టుబడిదారులు, ప్రజలు, విద్యార్థులు, సందర్శకులు..ఇలా వివిధ వర్గాలవారికి అమరావతి గురించి సమగ్ర సమాచారాన్ని అత్యాధునిక విధానాల ద్వారా వివరించడం, వారికి గొప్ప అనుభూతిని కలిగించడం ఈ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ ఏర్పాటు వెనుక ముఖ్యోద్దేశమని సీఆర్‌డీఏ పేర్కొంది. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి రొటీన్‌ ప్రజంటేషన్లతో కాకుండా.. అత్యాధునిక ఎల్‌ఈడీ ప్యానళ్లు, హోలోగ్రాఫిక్‌ ఇన్‌స్టలేషన్లు, ఇంట్రాక్టివ్‌ డిజిటల్‌ వాల్స్, ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ ద్వారా అమరావతి గురించి వివరిస్తే ఎక్కువ ప్రభావం ఉంటుందని సీఆర్‌డీఏ పేర్కొంది. దీనికి అవసరమైన కంటెంట్‌ను రూపొందించడం, స్ట్రక్చరల్‌ డిజైన్‌ ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలన్నీ ప్రైవేట్‌ ఏజెన్సీనే నిర్వహించాల్సి ఉంటుందని ప్రకటనలో తెలిపింది. సీఆర్‌డీఏ కార్యాలయంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో దీన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. రాజధాని సందర్శనకు వచ్చేవారికి సంప్రదాయ గ్యాలరీలు, ప్రజంటేషన్లకు భిన్నంగా...గొప్ప అనుభూతులను ఇచ్చేలా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ ఉండాలని పేర్కొంది. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉండాలని తెలిపింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





