
విశాఖపట్నం నడిబొడ్డున ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సెంట్రల్ పార్క్ వద్ద బుధవారం తెల్లవారుజామున వింత ఘటన కలకలం రేపింది. పార్క్ మెయిన్ గేటు ఎదుట ఉన్న ఓ చెట్టు కింద భారీగా చిరిగిపోయిన కరెన్సీ నోట్లు కుప్పగా దర్శనమివ్వడంతో స్థానికులు, మార్నింగ్ వాకర్స్ తీవ్ర విస్మయానికి గురయ్యారు. ఒకేచోట వేర్వేరు రకాల నోట్ల ముక్కలు పడి ఉండటంతో ఎవరో కావాలనే ఇలా పడేశారా లేక దీని వెనుక ఏదైనా నేరపూరిత కోణం దాగి ఉందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఉదయాన్నే వాకింగ్‌కు వచ్చిన స్థానికులు చెట్టు కింద అనుమానాస్పదంగా పడి ఉన్న నోట్ల కుప్పను గుర్తించారు. దగ్గరకు వెళ్లి పరిశీలించగా రూ. 500, రూ. 100, రూ. 50, రూ. 20, రూ. 10 నోట్లు అన్నీ ముక్కలు ముక్కలుగా చిరిగిపోయి, చెదలు పట్టిన స్థితిలో కనిపించాయి. కొన్ని నోట్ల నంబర్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్షణాల్లో ఈ దృశ్యాలు ఫోన్లలో రికార్డయి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నగరంలో చర్చనీయాంశంగా మారింది.





