
ఇంట్లో ఒకటికి రెండు గదుల్లో ఏసీలు అమర్చుకోవడం సర్వసాధారణం. రెండు ఏసీలు అనగానే చాలామందికి గుర్తొచ్చే పెద్ద సమస్య.. బయటి గోడలపై లేదా బాల్కనీలో రెండు భారీ అవుట్‌డోర్‌ యూనిట్లను బిగించడం. దీనివల్ల బాల్కనీల్లో స్థలం పూర్తిగా ఆక్రమించడమే కాకుండా ఇంటి బాహ్య రూపం కూడా దెబ్బతింటుంది. ఈ సమస్యకు చక్కటి పరిష్కారంగా ‘మల్టీ స్ప్లిట్‌ ఏసీ’ సాంకేతికత కొత్తగా అందుబాటులోకి వచ్చింది. ఒకే అవుట్‌డోర్‌ యూనిట్‌తో రెండు వేర్వేరు గదులకు చల్లదనాన్ని అందించే ఈ విధానం ఇటు స్థలాన్ని, అటు విద్యుత్‌ను ఆదాచేస్తూ ఆధునిక ఇళ్లకు ప్రాధాన్యతగా మారుతోంది. సాధారణంగా మనం వాడే సింగిల్‌ స్ప్లిట్‌ ఏసీలలో ప్రతి ఇండోర్‌ యూనిట్‌కు ప్రత్యేకంగా ఒక అవుట్‌డోర్‌ కంప్రెసర్‌ అవసరమవుతుంది. కానీ ఈ మల్టీ స్ప్లిట్‌ వ్యవస్థలో ఒకే ఒక శక్తిమంతమైన అవుట్‌డోర్‌ కంప్రెసర్‌ను అమరుస్తారు. దీన్నుంచి కాపర్‌ పైపింగ్‌ ద్వారా ఇంట్లోని రెండు వేర్వేరు గదులకు కనెక్షన్లు ఇస్తారు. చాలామందికి వచ్చే ప్రధాన సందేహం ఏంటంటే ఒకటే అవుట్‌డోర్‌ ఉన్నప్పుడు రెండు గదుల్లోనూ ఏసీలు ఒకేసారి నడవాలా? అని. కానీ దీనికి సమాధానం ‘లేదు’. రెండు గదుల్లోని ఇండోర్‌ యూనిట్లకు వేర్వేరు రిమోట్లు ఉంటాయి. మీకు అవసరమైన గదిలో మాత్రమే ఏసీ ఆన్‌ చేసుకోవచ్చు, ఉష్ణోగ్రతను దేనికది విడివిడిగా నియంత్రించుకోవచ్చు. ఈ మల్టీ స్ప్లిట్‌ ఏసీల వల్ల అపార్ట్‌మెంట్‌లు, విల్లాల్లో బాల్కనీ స్పేస్‌ చాలా మిగులుతుంది. భవనం బయటి గోడలపై పదుల సంఖ్యలో కేబుళ్లు, వైరింగ్‌ లేకుండా ఇల్లు శుభ్రంగా, అందంగా కనిపిస్తుంది. సాంకేతికంగా ఇవి ‘స్మార్ట్‌ ఇన్వర్టర్‌’ కంప్రెసర్లతో రూపుదిద్దుకోవడం వల్ల, మీరు ఒకే ఇండోర్‌ నడిపినా లేదా రెండూ ఒకేసారి నడిపినా లోడ్‌కు తగినట్లుగానే విద్యుత్‌ను వినియోగించుకుంటాయి. దీనివల్ల కరెంట్‌ బిల్లుల భారం అదుపులోనే ఉంటుంది. ఈ ఏసీలను ఎంచుకునేటప్పుడు కొన్ని సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. మొదటిది కెపాసిటీ లెక్కించడం. మీ రెండు గదుల విస్తీర్ణాన్ని బట్టి అవుట్‌డోర్‌ యూనిట్‌ సామర్థ్యాన్ని నిర్ధారించాలి. ఉదాహరణకు మాస్టర్‌ బెడ్‌రూమ్‌కు 1.5 టన్, చిన్న గదికి 1 టన్‌ సామర్థ్యం అవసరమైతే, బయట కనీసం 2.5 టన్ల సామర్థ్యం ఉన్న ఒకే అవుట్‌డోర్‌ యూనిట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక కోణంలో చూస్తే.. విడివిడిగా రెండు సాధారణ స్ప్లిట్‌ ఏసీలు కొనడం కంటే, ఒక మల్టీ స్ప్లిట్‌ ఏసీ సిస్టమ్‌ కొనుగోలు ఖరీదు, ఇన్‌స్టాలేషన్‌ ఛార్జీలు కాస్త ఎక్కువగా ఉంటాయి. పైపింగ్‌ పొడవు ఎక్కువ కావడం, నిపుణులైన టెక్నీషియన్లతోనే ఇన్‌స్టాల్‌ చేయించాల్సి రావడం దీనికి కారణం. అయినప్పటికీ భవిష్యత్తు అవసరాలు, స్థలం ఆదా, సుదీర్ఘకాల మన్నికను దృష్టిలో ఉంచుకుంటే మల్టీ స్ప్లిట్‌ ఏసీలు ఉత్తమమైన పెట్టుబడిగా నిలుస్తున్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





