
ఇల్లు నిర్మించేటప్పుడు, కొత్త వాటర్‌ ట్యాంక్‌ కొనుగోలు చేసేటప్పుడు ట్యాంక్‌ రంగు గురించి చాలా మంది పెద్దగా ఆలోచించరు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఏదో ఒక రంగు ట్యాంక్‌ను తెచ్చి మిద్దెపైన పెట్టేస్తుంటారు. అయితే.. వాటర్‌ ట్యాంక్‌ రంగు అనేది కేవలం డిజైన్, ఆకర్షణ కోసం మాత్రమే కాదు.. ఆ ట్యాంక్‌లోని నీటి ఉష్ణోగ్రత, శుభ్రత, నాచు పట్టే ప్రక్రియపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. వాతావరణం, అవసరాలను బట్టి ట్యాంక్‌ రంగును ఎంచుకోవడం శ్రేయస్కరం. నలుపు: నలుపు రంగు సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల ట్యాంక్‌ లోపల నాచు, బ్యాక్టీరియా త్వరగా పెరగవు. నీరు ఎక్కువ కాలం శుభ్రంగా ఉంటుంది. కానీ.. నలుపురంగు ఎక్కువ వేడిని గ్రహిస్తుంది. దీనివల్ల వేసవి కాలంలో ట్యాంక్‌లోని నీరు బాగా వేడెక్కి, వినియోగానికి ఇబ్బందిగా మారుతుంది. తెలుపు: తెలుపురంగు సూర్యరశ్మిని పరావర్తనం చేస్తుంది. ఎండ తీవ్రత ఎంత ఉన్నా.. ట్యాంక్‌లోని నీరు త్వరగా వేడెక్కదు. సాధారణ ఉష్ణ్టోగ్రతలోనే ఉంటుంది. కానీ.. తక్కువ లేయర్లు ఉన్న తెలుపు రంగు ట్యాంకుల్లోకి వెలుతురు సులువుగా ప్రవేశిస్తుంది. దీనివల్ల లోపల నాచు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మల్టీలేయర్‌ యూవీ ప్రొటెక్షన్‌ ఉన్న తెలుపు ట్యాంక్‌లను ఎంచుకోవడం మంచిది. నీలం/ఆకుపచ్చ, పసుపు: సూర్యరశ్మిని కొంతవరకు అడ్డుకుంటూనే.. నీరు మరీ ఎక్కువగా వేడెక్కకుండా చూస్తాయి. చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటాయి. సిల్వర్‌ / గ్రే..: ఇవి ఎండ వేడిమిని తగ్గిస్తాయి. మురికి త్వరగా కనిపించదు. దీర్ఘకాలం కొత్తవిగా ఉంటాయి. సాధారణ ట్యాంకుల కంటే.. కొద్దిగా ధర ఎక్కువగా ఉండవచ్చు. ప్లాస్టిక్‌ ట్యాంక్‌లు: ప్రస్తుతం ఇవే అత్యంత జనాదరణ పొందినవి. ఫుడ్‌గ్రేడ్, బీపీఏ ఫ్రీ అని ఉన్న ప్లాస్టిక్‌ ట్యాంక్‌లనే ఎంచుకోవాలి. ఇవి నీటిలో ఎలాంటి రసాయనాలు కలవకుండా సురక్షితంగా ఉంచుతాయి. యూవీ స్టెబిలైజ్డ్‌: ఎండ తాకిడికి ప్లాస్టిక్‌ పాడవకుండా, ట్యాంక్‌ ఆకారం దెబ్బతినకుండా ఉండేందుకు యూవీ ప్రొటెక్షన్‌ తప్పనిసరి. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ట్యాంక్‌లు: ఇవి ఆరోగ్యానికి అత్యంత సురక్షితం. ఎండవేడికి ప్లాస్టిక్‌ ట్యాంక్‌ మాదిరిగా వేడెక్కి మైక్రోప్లాస్టిక్స్‌ విడుదలచేయవు. ఎక్కువ కాలం మన్నుతాయి. శుభ్రం చేయడం తేలిక. కాకపోతే వీటి ధర ఎక్కువ. 3-లేయర్‌ ట్యాంక్‌లు: ప్రాథమిక రక్షణనిస్తాయి. బయటి పొర యూవీ రక్షణకు, లోపలి పొరలు నీటి శుభ్రతకు ఉపయోగపడతాయి. 4 - 5 లేయర్‌ ట్యాంక్‌లు: ఎండాకాలంలో నీరు బాగా వేడెక్కకుండా ఉండటానికి ‘ఇన్సులేషన్‌ ఫాం లేయర్లు’ ఉన్న ట్యాంకులు వినియోగించడం చాలా మంచిది. ఇవి నీటిని సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉంచుతాయి. యాంటీ బ్యాక్టీరియల్‌ లేయర్‌: ట్యాంక్‌లోపల నాచు, బ్యాక్టీరియా చేరకుండా ఉంచేందుకు యాంటీ బ్యాక్టీరియల్‌ కోటింగ్‌ ఉన్నవి ఎంచుకోవడం శ్రేయస్కరం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





