
సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు ఈనాడు, అమరావతి: ఊళ్లు, కాలనీలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా వాడవాడలా అన్నివర్గాలూ ఎంతో ఘనంగా చేసుకొనే పండుగ వినాయక చవితి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అన్ని వర్గాల ప్రజల్ని ఒకచోట చేర్చే గొప్ప సామాజిక పండుగ వినాయక చవితి. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలి. మట్టి ప్రతిమలను పూజిస్తూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మన సంస్కృతి, సంప్రదాయాలను మరింత వైభవంగా కొనసాగిద్దాం. ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు విఘ్నాలు ఎదురవ్వకుండా ఆశీర్వదించాలని గణనాథుడిని వేడుకుంటున్నాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. పర్యావరణహితంగా వినాయకచవితి వి ఘ్నాలను తొలగించి, శుభాలను ప్రసాదించే వినాయకచవితి పర్వదినాన్ని అందరూ పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. సంప్రదాయబద్ధంగా మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని కోరారు. ‘ప్రకృతిని దైవస్వరూపంగా భావించి నదులు, వృక్షాలు, పర్వతాలు, జీవరాశులను గౌరవించడం మన సంస్కృతిలో అంతర్భాగం. తొలి పూజలందుకునే వినాయకుడి అర్చనలో ఉపయోగించే పత్రి, పుష్పాలు, ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని చాటుతాయి. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు, కలగాలి. దేశ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు’ అని పవన్‌కల్యాణ్‌ అన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





