
లంబోదరా.. మిర్చి నగరానికి ప్రగతిఫలాలు అందించు స్వామీ ఈనాడు, అమరావతి లంబోదరుడి శరణు ఘోషతో ఊరూవాడా మార్మోగుతోంది. విఘ్నాలను తొలగించి, విజయాలను ప్రసాదించే ఆదిదేవుడు వినాయకుడి చవితి వేడుకలను జిల్లా ప్రజలంతా ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ పావన పర్వదినాన విఘ్ననాయకుడి కరుణాకటాక్షాలు గుంటూరు నేలపై సమృద్ధిగా కురవాలి. ప్రగతి పనులకు ఎదురవుతున్న అవరోధాలన్నీ పటాపంచలై, పెండింగ్‌ ప్రాజెక్టులు శీఘ్రంగా పూర్తయి, జిల్లా అన్ని రంగాల్లోనూ విజయభేరి మోగించాలని ప్రజానీకం ఆకాంక్షిస్తోంది. విఘ్నేశ్వరుని కృపతో జిల్లా విద్యా రంగం మరింత శోభిల్లాలన్న ఆకాంక్ష ఉంది. దశాబ్దాలుగా ఎంతోమంది మేధావులను, ప్రముఖ వైద్యులను దేశ విదేశాలకు అందించిన ఘనత ఈ నేలది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విస్తరణ, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన వేగవంతం కావాల్సి ఉంది. నూతన సాంకేతిక విజ్ఞానాన్ని విద్యార్థుల చెంతకు చేర్చే డిజిటల్‌ తరగతుల ప్రక్రియ పూర్తవ్వాలి. మరోవైపు, ఉమ్మడి జిల్లాల ప్రజలకు ఆపద్బాంధవుడిగా నిలిచే గుంటూరు సర్వజనాసుపత్రి ఆధునికీకరణ పనులు ఊపందుకోవాలి. సూపర్‌స్పెషాలిటీ సేవల విస్తరణ, పెండింగ్‌లో ఉన్న భవనాల నిర్మాణాలు, ఆధునిక వైద్య పరికరాల సమకూర్పు త్వరితగతిన జరగాలి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు మెరుగై, సామాన్యుడికి నాణ్యమైన వైద్యం ఉచితంగా అందడమే విఘ్నేశ్వరుడికి సమర్పించే నిజమైన నివేదన. ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డుకు నిలయమైన గుంటూరు, వాణిజ్యపరంగా గ్లోబల్‌ గుర్తింపు పొందింది. మిర్చి, పొగాకు, పత్తి పంట పండించే అన్నదాతకు సకాలంలో సాగునీరు, మద్దతు ధర దక్కేలా కాలు వల ఆధునికీకరణ, డ్రైనేజీ వ్యవస్థల బాగు పనులు త్వరితగతిన పూర్తికావాలి. జిల్లా పారిశ్రామిక రంగంలో టెక్స్‌టైల్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ప్రతిపాదనల దశ దాటి ఆచరణలోకి రావాలి. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పారిశ్రామిక కారిడార్లు, భూసేకరణల ప్రతిబంధకాలు తొలగిపోవాలి. జిల్లా నలుమూలల నిర్మించ తలపెట్టిన స్పైస్‌ పార్కులు, కోల్డ్‌ స్టోరేజ్‌ క్లస్టర్లు త్వరగా రూపుదిద్దుకుంటేనే రైతు ఉత్పత్తులకు సరైన విలువ దక్కుతుంది. గుంటూరులో చదువుకున్న వేలాది మంది యువతీయువకులు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా, స్థానికంగానే ఐటీ పార్కులు, పరిశ్రమల స్థాపన జరగాలి. కొత్త స్టార్టప్‌లను ప్రోత్సహించే సెంటర్లు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు క్షేత్రస్థాయిలో అందుబాటులోకి రావాలి. ప్రతిపాదనలకే పరిమితమైన ఐటీ హబ్‌లు నిజరూపం దాల్చాలి. గుంటూరు నగరం వేగంగా విస్తరిస్తోంది. అయితే శంకర్‌ విలాస్‌ ఫ్లైఓవర్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు విస్తరణ, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ప్రాజెక్టుల పనులు ఇంకా వేగవంతం కావాలి. ట్రాఫిక్‌ చిక్కులను వదిలించే ఫ్లైఓవర్ల నిర్మాణానికి నిధుల అడ్డంకులు తొలగాలి. సమగ్ర తాగునీటి పథకాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలి. అమరావతి రాజధాని ప్రాంతానికి ఆనుకుని ఉన్న కీలక రహదారుల అనుసంధానం వేగవంతమైతేనే వ్యాపార, వాణిజ్య రంగాలు మరింత ఊపందుకుంటాయి. ఈ వినాయక చవితి పర్వదినం జిల్లా ప్రగతికి నూతన అధ్యాయాన్ని లిఖించాలి. అభివృద్ధికి ఎదురవుతున్న రాజకీయ, ఆర్థిక, పరిపాలనా విఘ్నాలన్నింటినీ ఆ బొజ్జ గణపయ్య తన దివ్యత్వంతో తొలగించాలి. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, మౌలిక వసతుల రంగాల్లో పెండింగ్‌ పనులన్నీ సకాలంలో పూర్తయి..జిల్లా నవశకంలోకి అడుగుపెట్టాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, విజయాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





