
Harish Rao: సింగరేణి కోల్ మైన్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీఆర్‌పీ, పీఆర్సీల తక్షణ అమలుకై శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు(Harish Rao) సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కార్మికులు సమ్మె చేయడం చూశామని, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల అధికారులు సైతం రోడ్డెక్కాల్సిన దుస్థితి రావడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏటా క్రమంతప్పకుండా పీఆర్‌పీ చెల్లించగా, ప్రస్తుత ప్రభుత్వం గత రెండేళ్లుగా దానిని నిలిపివేసి అధికారుల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. పీఆర్‌పీ ఆపడం వల్ల అధికారుల్లో ఉత్సాహం తగ్గి బొగ్గు ఉత్పత్తి భారీగా పడిపోయిందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కేటీపీఎస్, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో కొన్ని యూనిట్లు మూతపడ్డాయని, వర్షాకాలంలో కూడా తెలంగాణ డిస్కంలు బయటి నుంచి కరెంటు కొనుగోలు చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. దాదాపు 2,500 మంది అధికారులు నల్ల కండువాలతో నిరసన తెలుపుతున్నా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించకపోవడం శోచనీయమన్నారు. కోల్ ఇండియా తరహాలో ‘పే అప్‌గ్రేడేషన్’ విధానాన్ని సింగరేణిలోనూ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో పారదర్శకంగా జరిగిన బదిలీలు, నేడు రాజకీయ జోక్యంతో అవినీతిమయంగా మారాయని హరీశ్ రావు ఆరోపించారు. జీఎంలు, కింది స్థాయి అధికారులు పోస్టింగ్‌ల కోసం డిప్యూటీ సీఎం ఇంటి చుట్టూ పైరవీలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సింగరేణి సీఎండీ, డిప్యూటీ సీఎం వెంటనే అసోసియేషన్‌తో చర్చలు జరిపి, బకాయి పీఆర్‌పీ నిధులు విడుదల చేసి సమ్మె విరమింపజేయాలని డిమాండ్ చేశారు. అధికారులు అధైర్యపడవద్దని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన భరోసానిచ్చారు